‘మఠంపల్లి’కబ్జాలో అధికార పార్టీ హస్తం: ఉత్తమ్

by Shyam |   ( Updated:2021-01-10 07:16:26.0  )
‘మఠంపల్లి’కబ్జాలో అధికార పార్టీ హస్తం: ఉత్తమ్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : మఠంపల్లి ప్రభుత్వ భూముల కబ్జాలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని పెద్దవీడు రెవెన్యూ గ్రామ పరిధిలో 540 సర్వే నెంబరులో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ, పేదల భూముల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మఠంపల్లి మండలం పెద్దవీడు రెవిన్యూ పరిధిలోని 45 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నా.. నేటికీ పట్టించుకునే నాథుడు లేడన్నారు. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, పేదల భూములు అధికారుల సహాయంతో అధికార పార్టీకి చెందిన నేతలు అక్రమించుకుంటున్నారని పేర్కొన్నారు.

ఈ విషయంలో హుజుర్‌నగర్ ఆర్డీఓ అసమర్థత కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని తెలిపారు. దాదాపు నెల క్రితం ప్రభుత్వ భూమి అని నిర్దారించి పెన్సింగ్ వేస్తానని చెప్పారని, కానీ ఇప్పటి వరకు అలాంటిదేది జరగలేదని పేర్కొన్నారు. స్వయంగా కలెక్టర్ ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెడితే.. దాన్ని పీకేసి భూమిని కబ్జా చేశారని తెలిపారు. భూముల వ్యవహారంలో జిల్లా యంత్రాంగం వైఖరిపై అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం మఠంపల్లి మండలం పెదవీడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 540లోని 46 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.

Advertisement

Next Story