మండల జనాభా తెలియని ఎంపీడీవో, తహశీల్దార్… ఎంపీ ప్రశ్నకు నోరెళ్లబెట్టిన అధికారులు

by Shyam |
మండల జనాభా తెలియని ఎంపీడీవో, తహశీల్దార్… ఎంపీ ప్రశ్నకు నోరెళ్లబెట్టిన అధికారులు
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మరియు పదరా మండలాల్లో జరిగిన సర్వసభ్య సమావేశానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ మండల సర్వసభ్య సమావేశంలో వైద్య శాఖ పై చర్చ జరుగుతుండగా మండల జనాభా ఎంత అని ఎంపీడీవోను తాసిల్దార్ ను ఎంపీ రాములు ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక పై అధికారులు నీళ్ళు నములుతూ తెల్లమొహం వేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ మన్నెమ్మ మండల జనాభా 30 వేల పై చిలుకు ఉందని సమాధానం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా మండలాన్ని మరియు గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు.

ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన ప్రతి ఒక్కరు ప్రజల కోసం పని చేయడానికి ఉన్న విషయాన్ని మర్చిపోరాదని, నాలుగు కాలాలు గుర్తుండేలా ప్రజా ప్రతినిధులు తమ పాత్రను పోషించాలన్నారు. అధికారుల బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని, ప్రజా ప్రతినిధులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు పోతుంటారన్నారు. కానీ అధికారులు కృతనిశ్చయంతో పనిచేయాలని సూచించారు. అలాగే మండల సర్వసభ్య సమావేశానికి ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యేలా కలెక్టర్ కచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలని గుర్తు చేశారు. దోమలపెంట గ్రామంలో వైద్య సదుపాయాలు మంచినీటి సమస్య అంతర్గత రోడ్ల విషయం పై సర్పంచ్ శారద, ఎంపీటీసీ మల్లికార్జున్ సభలో ప్రస్తావించారు. అలాగే ఉప్పునుంతల, తిరుమలాపూర్, మాధవ పల్లి, జంగం రెడ్డిపల్లి గ్రామాలలో విద్యుత్ సమస్య పై సభలో ప్రస్తావించారు.

ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు..

గడిచిన 11వ సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని ఎంపీపీ శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు ప్రజలతో సంబంధం లేదన్నట్టుగా వారి వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ నిధుల నుంచి ప్రత్యేకంగా ఈ మండలానికి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని, ప్రశాంత్ నగర్, మొలక మామిడి మరియు ఈదుల భావి గ్రామాలకు బీటీ రోడ్డు మంజూరు అయ్యేలా చూడాలన్నారు. పాఠశాలలో మౌలిక వసతులకు నిధులు కేటాయించాలని, అమ్రాబాద్ మండలం లో దళితులు అధికంగా ఉన్నారని కావున ఈ మండలంలో దళిత బంధు పథకాన్ని ప్రకటించేలా ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి విధంగా కృషి చేయాలని సభ ద్వారా ఎంపీ ని కోరారు.

సమావేశానికి హాజరు కాని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా అమ్రాబాద్ మరియు పదరా మండలాలలో గల అంగన్వాడి టీచర్లకు ఎంపీ రాములు చేతులమీదుగా స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రణీత, ఎంపీడీవో ఇంద్రసేన, తహశీల్దార్ RWS డీఈ హేమలత, ఇంజనీరింగ్ డీ ఈ బాలస్వామి, ఐసీడీఎస్ సీడీపీవో దమయంతి, డాక్టర్లు అనిల్, అరుణ, పంచాయతీరాజ్ ఏఈ మహేందర్, ఎంఈఓ బాలకిషన్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed