పొలిటికల్ ఎంట్రీపై నాగార్జున క్లారిటీ!

by Javid Pasha |   ( Updated:2022-09-30 12:01:44.0  )
పొలిటికల్ ఎంట్రీపై నాగార్జున క్లారిటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వెండి తెర మన్మధుడు అక్కినేని నాగార్జున త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. త్వరలో ఏపీలోని అధికార వైసీపీ తీర్థం పుచ్చుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు నాగార్జున రెడీ అయిపోయారని, ఆయన రాకకు సీఎం జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ జోరందుకుంది. ఆయనకు విజయవాడ లేదా గుంటూరు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని ఊహాగానాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ ప్రచారంపై నాగార్జున స్పందించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న యాక్షన్ మూవీ ది ఘోస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరింది.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన నాగార్జున తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని ప్రచారం జరుగుతున్నదని ఈ సారి జరుగుతున్న ప్రచారం కూడా అలాంటిదే అన్నారు. అయితే మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఖండించారు. అయితే నాగార్జున వైసీపీలో చేరబోతున్నారనే వార్త ఇప్పటి నుంచే కాదు చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది. సినిమాలతో పాటు వ్యాపార వేత్తగా నాగార్జున రాణిస్తున్నారు. అలాగే వైఎస్ కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లినప్పుడు కూడా అనేక సార్లు నాగార్జున జైలుకు వెళ్లి మరీ పరామర్శించి వచ్చాడు.

ఏపీలో పార్టీల మధ్య ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో నాగార్జున వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే నాగార్జున తరం నటుల్లో ఇప్పటికే బాలకృష్ణ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా చిరంజీవి గతంలో ప్రజారాజ్యం స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. ఇక నాగార్జున సైతం రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటుతాడని నాగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుండగా అంతలోనే ఆయన ఈ వార్తలను ఖండించారు.

ఇవి కూడా చదవండి : ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది: సైఫ్‌పై రాధిక ప్రశంసలు

Advertisement

Next Story

Most Viewed