1992 ఘ‌ట‌న‌కు క‌థ రూప‌మే విరాట‌ప‌ర్వం: వేణు ఊడుగుల‌

by GSrikanth |   ( Updated:2022-06-13 02:31:50.0  )
1992 ఘ‌ట‌న‌కు క‌థ రూప‌మే విరాట‌ప‌ర్వం: వేణు ఊడుగుల‌
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వరంగల్ జిల్లాలో విరాట‌ప‌ర్వం చిత్ర యూనిట్ సందడి చేసింది. ఓరుగ‌ల్లు ప్రాంతంలో 1992లో జ‌రిగిన ఓ మ‌ర‌ణం త‌న‌ను తీవ్రంగా క‌దిలించి వేసింద‌ని, ఒక మ‌ర‌ణం వెనుక రాజ‌కీయ కోణాలు ఆధిప‌త్య పోరు దాగి ఉంద‌ని, ఆ సంఘ‌ట‌న‌కు ఓ ప్రేమ క‌థ‌ను జోడించి 'విరాట‌ప‌ర్వం' అనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ద‌ర్శకుడు వేణు ఊడుగుల వివ‌రించారు. వెన్నెల పాత్రను సాయి ప‌ల్లవి పోషించ‌డం అనేది ద‌ర్శకుడిగా తాను అదృష్టంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. మ‌ట్టి ముద్దను కూడా బాంబుగా త‌యారు చేసే విప్లవోద్యమ‌కారుడి పాత్రలో రాణా న‌టించార‌ని అన్నారు.

వెన్నెల క‌థ‌లో అంత‌ర్భాగంగా ఉన్న రాణా ఇమేజ్‌ను ప‌క్కన పెట్టి న‌టించ‌డం ఆయ‌న మంచి వ్యక్తిత్వానికి నిద‌ర్శన‌మ‌న్నారు. స‌మాజానికి మంచి చిత్రం అందించాల‌నే ఆకాంక్షతోనే సురేష్ ప్రొడ‌క్షన్ ఈ సినిమా నిర్మాణానికి ముందుకు రావ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. సినిమాలో భార‌త‌క్క పాత్రలో ప్రియ‌మ‌ణి, మరో కీలక పాత్రల్లో నందితాదాస్‌, న‌వీన్ చంద్రలు అద్భుతంగా పోషించార‌ని అన్నారు. ఏ ప్రాంతంలో అయితే అప‌జ‌యాలు కూడా జ‌యాలుగా అగ్ని జ్వాల‌లై పుడుతాయో.. ఆ ప్రాంత‌మే ఓరుగ‌ల్లు ప్రాంత‌మంటూ ద‌ర్శకుడు వేణు ఊడుగుల కీర్తించారు. విరాట‌ప‌ర్వం మూవీకి చాలామంది వ‌రంగ‌ల్ బిడ్డలు ప‌నిచేశార‌ని గుర్తుచేశారు.

అనంతరం ఈ ఫంక్షన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఓరుగల్లు ప్రాంతంలో సినిమాల నిర్మాణాలు పెర‌గాల‌ని ఆకాంక్షించారు. వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో సినిమాలు రావాల‌ని ఈ సంద‌ర్భంగా అభిలాష‌ను వ్యక్తం చేశారు. వ‌రంగ‌ల్‌లో సినిమాలు నిర్మించే క‌ళాకారుల‌కు, నిర్మాత‌ల‌కు, న‌టీన‌టుల‌కు త‌గిన స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని చెప్పారు. రామా నాయుడు హైదరాబాద్‌లో కట్టినట్లు వరంగల్‌లో రానా దగ్గుబాటి స్టూడియో కట్టాలని, స్థలం ఇప్పించే బాధ్యత తనదే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దయాక‌ర్‌, పాట‌ల ర‌చ‌యిత మిట్టప‌ల్లి సురేంద‌ర్‌తో పాటు చిత్రబృందంలోని ముఖ్య తారాగ‌ణం, టెక్నీషియన్లు హాజ‌ర‌య్యారు. యాంక‌ర్ శ్యామ‌ల‌, బిత్తిరి స‌త్తిలు కార్యక్రమంలో న‌వ్వులు పూయించారు.

Advertisement

Next Story