అందాల డాక్టర్.. అందగత్తె కిరీటం

by Sathputhe Rajesh |
అందాల డాక్టర్.. అందగత్తె కిరీటం
X

దిశ, ఫీచర్స్ : డాక్టర్ కావాలనే అమ్మమ్మ కలను నెరవేర్చిన ఆమె అందమైన మోడల్ గానూ తన కలను సాకారం చేసుకుంది ఐశ్వర్య పాతపాటి. ఒక డాక్టర్ గా పేదలకు సేవ చేయాలని తపించిన ఆమె, ప్రస్తుతం మన దేశం తరఫున ‘టాప్‌ మోడల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఇండియా-2023’ కాంపిటీషన్‌లో సక్సెస్ సాధించింది. త్వరలోనే ప్రపంచ వేదికపై తళుక్కు మనేందుకు రెడీగా ఉంది. ఇంతకీ ఐశ్వర్య డాక్టర్ నుంచి మోడల్ వరకు తన ప్రయాణం ఎలా కొనసాగిందో వివరించింది.

ఐశ్వర్య కుటుంబ నేపథ్యం..

అపర్ణ, అప్పలరాజుల ముద్దుల తనయ ఐశ్వర్య. తల్లి గృహిణి, తండ్రి వ్యాపారి. ఆమె చెల్లి పేరు అనిమిష. చదువుకునే రోజుల్లో ఐశ్వర్య యాక్టివ్ స్టూడెంట్ మ్యాథ్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం. మార్కులు కూడా బాగా తెచ్చుకునేది. లెక్కల్లో ఆమె ప్రతిభను చూసి అందరూ రామానుజం అంటూ సరదాగా పిలిచేవారని ఐశ్వర్య గుర్తు చేసుకుంది. అయితే ఆమె తన అమ్మమ్మ డయాబెటిస్ పేషెంట్ కావడంతో దగ్గరుండి మాత్రలు ఇచ్చేదట. ఈ సందర్భంగా ఐశ్వర్యను వాళ్ల అమ్మమ్మ సరదాగా ‘డాక్టరుగారూ..’ అని పిలిచేదట. అంతేకాదు ‘ పెద్దయ్యాక నువ్వు డాక్టర్ అవ్వాలి.

పేదలకు ట్రీట్‌మెంట్ అందించాలి’ అని తన అమ్మమ్మ తరచూ చెప్పేదని ఐశ్వర్య పేర్కొన్నది. అమ్మమ్మకే కాదు, వాళ్ల అమ్మకు కూడా ఐశ్వర్య డాక్టర్ కావాలనే కోరిక ఉండేదని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో తనలో డాక్టర్ కావాలన్న ఆసక్తి పెరిగిందని వివరించింది. డాక్టర్ కావాలన్న ఇంట్రెస్ట్‌తోనే ఇంటర్‌లో బైపీసీలో చేరాలనుకుంది ఐశ్వర్య. అయితే ఆ సందర్భంలో వాళ్ల బైపీసీ వద్దని చెబితే, వాళ్ల అమ్మ కన్విన్స్ చేసిందని గుర్తు చేసింది ఐశ్వర్య. ఎంబీబీఎస్‌ అయ్యాక న్యూట్రిషన్‌, డెర్మటాలజీ కోర్సులు పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీలో జనరల్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తోంది. కాగా ఫ్యూచర్‌లో భవిష్యత్తులో కాస్మొటిక్‌ సర్జరీ కోర్సులు చేయాలనేది తన బలమైన కోరిక అంటోంది ఐశ్వర్య.

మోడలింగ్‌ వైపు అడుగులు..

అందం, ఆరోగ్యం, చదువు ఆడపిల్లల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపుతాయంటారు పెద్దలు. అమ్మమ్మ కూడా అదే చెప్పేదని, తనక్కూడా అందాన్ని కాపాడుకోవడానికి, మొటిమలు పోవడానికి కొన్ని చిట్కాలు చెప్పేదని గుర్తు చేసుకుంది. అందం ముఖ్యమైందని, దానిని కాపాడుకోవాలని వాళ్ల అమ్మమ్మ చెప్తుంటూ తను పెద్దయ్యాక అందాల పోటీల్లో పాల్గొనాలని కూడా అనుకునే దాన్నంటూ ఐశ్వర్య వివరించింది.

ఎంబీబీఎస్‌ తర్వాత ఆమె తన అందంపై మక్కువతో రకరకాలుగా ఫొటోలు దిగుతూ ఇన్‌స్టాలో పోస్టు చేసేది. ఒకసారి పొడవైన జుట్టుతో దిగిన ఫొటోను షేర్ చేయగా అది చూసిన ఒక యాడ్‌ ఏజెన్సీ మోడలింగ్‌ చేయాలని ఆఫర్ ఇచ్చిందని ఐశ్వర్య వివరిచంది. అయితే ఇంట్లో అందుకు ఒప్పుకుంటారో లేదోననే అనుమానంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మోడలింగ్ చేసిందట. ఈ క్రమంలోనే మిస్‌ ఇండియా ఫెమినా పోటీలకూ వెళ్లింది. అయితే తగిన ట్రైనింగ్, అవగాహన లేకపోవడంతో తిరిగి వచ్చేసింది.

అయితే ఈసారి ఎలాగైనా తన కలనెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో శిక్షణ తీసుకున్న ఆమె 2022 డిసెంబరులో ‘టాప్‌ మోడల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఇండియా - 2023’ పోటీల కోసం రిపోర్టు చేసింది. ఆ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది ఎంపికవగా తుది జాబితాలో తనతోపాటు మరో 11 మంది పేర్లు సెలెక్టయినట్లు తెలిపింది ఐశ్వర్య. ఆ తర్వాత జనవరిలో ఢిల్లీలో పలు దఫాలుగా నిర్వహించిన వడపోతల్లో తనను విజేతగా ప్రకటించారని ఐశ్వర్య ఆనందం వ్యక్తం చేసింది. ఇందులో విజేతలైనవారు మిస్‌ ఎర్త్‌, మిస్‌ గ్లోబ్‌ కాంపిటీషన్లో పాల్గొనవచ్చని ఆమె వెల్లడించింది.

అయితే ఆ సందర్భంలో ఆమె వాళ్ల నాన్నకు ఎంతో నచ్చజెప్పి తనతోపాటు ఢిల్లీకి తీసుకెళ్లిందట. ‘‘అందాల కిరీటాన్ని నాకు బహూకరించడం చూసిన తర్వాత నేను నాన్న ముఖంలో చాలా సంతోషాన్ని చూశా’’ అని భావోద్వేగానికి లోనైంది ఐశ్వర్య. కాగా త్వరలో ఈజిప్టులో జరగనున్న ‘టాప్‌ మోడల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ పోటీకి ఇండియా తరఫున ఐశ్వర్య హాజరు కానుంది. ఇక్కడ పాల్గొనే 60 బ్యూటీలతో పోటీ పడనుంది. అందాలపోటీకి రెడీగా ఉన్న ఐశ్వర్య తన డాక్టర్ వృత్తిని కూడా ఏమాత్రం వదిలి పెట్టలేదు. సర్జరీలు చేస్తోంది. చికిత్స తర్వాత పేషెంట్ల ముఖాల్లో నవ్వు చూసినప్పుడు తనకు ఎంతో సంతృప్తి కలుగుతుందని చెప్తోంది ఐశ్వర్య.

Advertisement

Next Story

Most Viewed