అత్త శాడిజం.. కోడలికి కరోనా అంటించి మరీ..

by Anukaran |   ( Updated:2021-05-31 03:56:57.0  )
అత్త శాడిజం.. కోడలికి కరోనా అంటించి మరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: అత్త లేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అని పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు.. ఎందుకంటే అత్తాకోడళ్లకు ఒక్క నిమిషం కూడా పడదు కాబట్టి.. కొడుకును తన కొంగుకు కట్టేసుకుని తిరుగుతుందని అత్త బాధ.. తననే అత్తగారు చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని కోడలి గారి ఆవేదన. అయితే ఇలాంటి సమస్య ప్రతి ఇంట్లోనూ ఉండేదే.. కానీ ఓ అత్త మాత్రం ఈ కరోనా కాలంలో తన కోడలిపై పగ పెంచుకోంది. కరోనా వచ్చిన తనను దూరం పెడుతున్నారని కక్ష కట్టిన అత్తగారు తన కరోనా రోగాన్ని కోడలికి అంటించింది. ఆ తర్వాత కోడలికి కరోనా వచ్చిందని చెప్పి ఇంట్లోనుండి బయటికి గెంటేసింది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్లలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్ట తండా వాసితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు.. ఆమె భర్త ఏడు నెలల క్రితం పనికోసం ఒడిశా కి వెళ్లాడు. దీంతో అత్తామామలతోనే మహిళా నివాసముంటుంది. ఈ నేపథ్యంలోనే గతకొన్నిరోజుల క్రితం ఆమె అత్తకు కరోనా సోకింది. దీంతో ఆమెను హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కోడలు పిల్లలను అత్తగారి వద్దకు పంపించకుండా అడ్డుకుంది. అది గమనించిన అత్త తానూ చనిపోతే తన కోడలు సుఖంగా ఉంటుందని, తనను సరిగ్గా పట్టించుకోకుండా అందరికి దూరం చేస్తుందని కక్ష పెంచుకుంది.

తన కోడల్ని ఎలాగైన బయటకు గెంటేయాలని ప్లాన్ వేసింది. తనకు అన్నం పెట్టడానికి వచ్చిన కోడల్ని కౌగిలించుకొని లేని పోనీ ప్రేమను కురిపించడం మొదలుపెట్టింది. ఆమెతో పాటు పిల్లల్ని కూడా బలవంతంగా ముద్దు పెట్టుకోవడం లాంటివి చేస్తూ అతిప్రేమ ఒలకబోసింది. ఇక కొన్నిరోజులు అత్తకు నెగెటివ్ రాగా, కోడలికి పాజిటివ్ అని తేలింది. కోడల్ని కౌగిలించుకోవడం వలన అత్తగారి కరోనా కోడలికి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇక ఇదే అదునుగా భావించిన అత్తా కోడలికి కరోనా వచ్చిందని ఇంట్లో నుండి బయటికి గెంటేసింది. ఆమె చిన్న పిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూడకుండా బయటకు నెట్టేశారు. దీంతో కోడలు తన సోదరి ఇంటికి చేరుకొంది. ఈ అమానుష ఘటనపై మహిళా బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అత్తామామలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story