EMIలు కట్టే వారికి బిగ్ షాక్.. రుణ రేట్లు పెంచేసిన ఆ బ్యాంకులు

by S Gopi |   ( Updated:2022-07-01 11:02:22.0  )
EMIలు కట్టే వారికి బిగ్ షాక్.. రుణ రేట్లు పెంచేసిన ఆ బ్యాంకులు
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) నిధుల వ్యయ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) ఆధారిత రేట్లను అన్ని కాలవ్యవధులపై పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 15 బేసిస్ పాయింట్లు అంటే 0.15 శాతం మేర పెంచిన బ్యాంకు, ఈ రేట్లు జూలై 1 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కోంది. దీంతో వినియోగదారుల రుణాలపై ఈఎంఐ భారం పడనుంది. శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం, బ్యాంకు బేస్ రేటు 8.50 శాతం నుంచి 8.75 శాతానికి పెంచింది. అలాగే, ఓవర్‌నైట్ నుంచి మూడేళ్ల కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ రేటు 6.75 శాతం నుంచి 7.85 శాతం మధ్య పెంచింది. పీఎన్‌బీ బాటలోనే ఇండియన్ బ్యాంకు సైతం ఎంసీఎల్ఆర్, ట్రెజరీ బిల్‌ బెంచ్‌మార్క్‌ లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌(టీబీఎల్ఆర్), బేస్ రేటు, బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ను పెంచుతున్నట్టు ప్రకటించింది.

పెంచిన రేట్లు జూలై 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, వివిధ కాలవ్యవధులపై ఎంసీఎల్ఆర్ రేటును 15 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీబీఎల్ఆర్ రేటును వివిధ కాలవ్యవధులకు 40-55 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. అదేవిధంగా బేస్ రేటును 40 బేసిస్ పాయింట్లతో 8.30 శాతం నుంచి 8.70 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ రేటుకు సంబంధించి ఓవర్‌నైట్ నుంచి ఏడాది కాలవ్యవధులపై వడ్డీ రేట్లు 6.75 శాతం నుంచి 7.55 శాతం మధ్య పెంచింది. అదేవిధంగా ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ బజాజ్ ఫైనాన్స్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లతో 7.50 శాతానికి పెంచుతున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పెంచిన రేట్లు జూలై 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. రూ. 15,000తో మొదలయ్యే అన్ని పెట్టుబడులపై ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచింది. సీనియర్ సిటిజన్లకు బేస్ రేట్‌లపై 0.25 శాతం అదనపు వడ్డీని అందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story