ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Shyam |
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
X

దిశ, పటాన్ చెరు: ప్రతిఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం రామచంద్రాపురం పట్టణ పరిధిలోని మెడికవర్ హాస్పిటల్స్ లో వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. మియాపూర్ ఏసిపి కృష్ణప్రసాద్, స్థానిక కార్పొరేటర్లు పుష్ప నగేష్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, సీఐ సంజయ్ కుమార్ లతో కలిసి ఎమ్మెల్యే మెడికవర్ హాస్పిటల్స్ లో వాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. దాదాపు 400 మందికి మొదటి డోసు, 100 మందికి రెండవ డోసు ఇచ్చారు. వీరిని 30 నిమిషాల పాటు వైద్యులు పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అత్యంత పేరుగాంచిన ఆసుపత్రులలో మెడికవర్ ఒకటి అన్నారు. ఇక్కడ వాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. వాక్సినేషన్ గురించి ఎలాంటి వదంతులని నమ్మవద్దని అన్నారు. ఏసిపి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవడంతో పాటు సామజిక దృక్పధంతో భౌతిక దూరం పాటించాలని తెలిపారు. మాస్క్ తప్పనిసరిగా వాడాలని, రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలని సూచించారు. మరి కొన్ని రోజుల పాటు అత్యంత జాగ్రత్త వహించాలని అన్నారు.

ఆసుపత్రి సెంటర్ హెడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఈ వాక్సినేషన్ డ్రైవ్ ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరు కోవిన్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకొని టీకా కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. టీకా పూర్తిగా సురక్షితమైనదని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నాక కూడా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, యెల్లో ఫంగస్ వ్యాప్తి ఉన్నందున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story