కొడుకుతో విసిగిపోయిన ఆ ఎమ్మెల్యే.. ఏం చేశాడంటే..

by Sumithra |   ( Updated:2021-02-18 08:25:02.0  )
కొడుకుతో విసిగిపోయిన ఆ ఎమ్మెల్యే.. ఏం చేశాడంటే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. భూముల ధరలు ఆకాశాన్నంటాయి. పైగా హైదరాబాద్ మహానగరానికి అత్యంత సమీపంలోనే ఉన్నది. అదే స్థాయిలో వెంచర్లు, ఫాం హౌజ్ లేఅవుట్లు, విల్లాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే కదా.. అక్రమార్కులకు కావాల్సింది. ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు… తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇవే అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే కొడుకు భూ కబ్జాలు, అక్రమాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. గ‌తంలో ఆ ఎమ్మెల్యే పైనా భూ కబ్జా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే టికెట్టు కష్టమేనన్న ప్రచారం కూడా సాగింది. కానీ సిట్టింగులకే మరోసారి సీటు అనడంతో అదృష్టం వరించింది. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు కూడా అదే బాట‌లో న‌డుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శివారులోని ఓ మున్సిపాలిటీ ప‌రిధిలో అనేక భూ క‌బ్జా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం.

తాజాగా నియోజకవర్గంలో భారీగా వెంచ‌ర్లు ఏర్పాటవుతున్నాయి. గ‌తంలో వెలిసిన వెంచ‌ర్లు అనేకం ఉన్నాయి. ఐతే ఈ వెంచ‌ర్లలోని పార్కులకు కేటాయించిన భూముల అమ్మకాల్లో ఎమ్మెల్యే కొడుకు, కొందరు కౌన్సిలర్లు తెర వెనుక ఉన్నట్లు తెలిసింది. చాలా వరకు పార్కు స్థలాలను ఆక్రమించుకున్నారు. వెంచ‌ర్లలోని పార్క్ స్థలాలను క‌బ్జా చేసి త‌న అనుచరులు, బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. తాజాగా ఓ వెంచ‌ర్‌లో నివాస‌ముంటున్న ఇండ్ల య‌జ‌మానులు సదరు ఎమ్మెల్యే ద‌గ్గరకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తన కొడుక్కి నచ్చజెప్పే ప్రయ‌త్నం చేసినా విన‌డం లేద‌ని తెలుస్తోంది. త‌న పేరు వాడుకొని కొడుకు భూ క‌బ్జాల‌కు పాల్పడ‌టం ఆ ఎమ్మెల్యేకు న‌చ్చక మంద‌లించారని ప్రచారం జరుగుతోంది. వారిద్దరి మ‌ధ్య అభిప్రాయభేదాలు త‌లెత్తిన‌ట్టు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. వ‌చ్చేసారి ఎమ్మెల్యే టికెట్ త‌న‌దేనంటూ కొడుకు అనుచ‌రులతో ప్రచారం చేయించుకోవ‌డం కూడా ఆయనకు నచ్చక దూరం పెట్టిన‌ట్లు చ‌ర్చించుకుంటున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

పార్కు స్థలాలను బై నంబర్లు వేసి అమ్మేశారని, కబ్జా చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు సమర్పించారు. మున్సిపాలిటీ కేంద్రంలోనే కొంత మంది ఏకంగా వైకుంఠధామాల స్థలాలకు నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి కబ్జాకు యత్నిస్తున్నారన్న ఫిర్యాదులు అందాయి. పక్కనే ఉన్న పట్టా భూముల సర్వే నంబర్లు వేసి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఐతే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నా స్థానిక కౌన్సిలర్లు, నాయకులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు చూస్తున్నారని జనం మండిపడుతున్నారు. ఎమ్మెల్యే, ఆయన కొడుకు కూడా అదే దారిలో ప్రయాణం చేస్తుండడంతో అదే దారిలో మిగతా ప్రజాప్రతినిధులు నడుస్తున్నారన్న చర్చ నడుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed