బతుకమ్మలకు అవమానం.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే చల్లా

by Shyam |   ( Updated:2021-10-07 05:41:43.0  )
బతుకమ్మలకు అవమానం.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే చల్లా
X

దిశ, పరకాల : బతుకమ్మలను అవమానించడం అబద్దం అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు. దామెర మండలం ల్యాదల్ల గ్రామంలో గురువారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ వేడుకలను పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చీరల పంపిణీ చేపట్టిందని అన్నారు.

అయితే.. కొందరు కావాలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరుస్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నన్ను సైతం ఏదో ఒక వంకతో అభాసుపాలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలో నేను కారుతో బతుకమ్మలను తొక్కించానని.. కారులో నేను లేనప్పటికీ ఉన్నానని ఆత్మకూరు గ్రామ సర్పంచ్ కావాలనే నాపై నిందలు వేశారని తెలిపారు. ఈ క్రమంలోనే నా కారు వద్దకు వచ్చి కారును కొట్టడం, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారని అన్నారు.

నేను అంతకు ముందే బతుకమ్మలు ఆడుతున్న మహిళలందరికీ అభివాదం చేస్తూ.. వాళ్లందరితో మాట్లాడుతూ కాలినడకన ముందుకు వెళ్లిపోయానని స్పష్టం చేశారు. నా కారు గానీ, మరెవరూ కానీ బతకమ్మలను కనీసం సగం కూడా తాకలేదు అంటూ వివరించారు. ఓ ‘దిన’ పత్రికలో(దిశ పత్రిక కాదు)బలవంతంగా తప్పుడు వార్తలను రాయించి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలు ఎవరు దీనిని నిజమని నమ్మకండి అంటూ.. నా వల్ల మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించాలని కోరారు. తప్పుడు వార్తా కథనాలు రాస్తూ.. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విమర్శలకు దిగితే సహించేది లేదంటూ ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story