బీసీలకు ప్రధాని ఏం చేసిండు : గంగుల, ఆర్.కృష్ణయ్య

by Shyam |
బీసీలకు ప్రధాని ఏం చేసిండు : గంగుల, ఆర్.కృష్ణయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాని మోడీ బీసీ వర్గానికి చెందిన వాడే అయినా.. వెనుకబడిన తరగతులకు చేసిందేం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. మంగళవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య నేతృత్వంలో నిర్వహించిన బీసీల మహాదీక్షలో ఆయన మాట్లాడారు. బీసీలు వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వారు కాదని, వెనక్కి నెట్టేయబడుతున్న సామాజిక వర్గానికి చెందిన వారన్నారు. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల డిమాండ్ కొత్తది కాదని వివరించారు. బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. వారి సంక్షేమానికి ఆత్మగౌరవ భవనాలు, ఎంబసీ, ప్రత్యేక నిధి, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి లక్ష కోట్ల బడ్జెట్ ఆశిస్తే రూ.వెయ్యి కోట్లు కూడా ప్రకటించలేని స్థితిలో కేంద్రం ఉందని మంత్రి ఘాటు విమర్శలు చేశారు. కేంద్రంలో బీసీ వెల్ఫేర్ మంత్రిత్వశాఖ లేకపోవడం దురదృష్టకరమని మంత్రి గంగుల ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇప్పటికైనా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్​రైతులు చేస్తున్నట్లుగా బీసీల న్యాయపరమైన హక్కుల సాధనకు పార్లమెంట్ ముందు బైఠాయించి పోరాటం చేయాల్సిన అవసరముందని మంత్రి గంగుల పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకతీతంగా పోరాడాలని సూచించిన ఆయన బండి సంజయ్, ఓబీసీ మోర్చా లక్ష్మణ్‌కు తమతో కలిసి పోరాడే దమ్ముందా? అని ఆయన వారికి సవాల్ విసిరారు.

50 శాతం రిజర్వేషన్లు కల్పించండి : ఆర్ కృష్ణయ్య

పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తాము కేంద్రానికి 16 డిమాండ్లు పెట్టామని, 5 సార్లు ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేసినా నేటికీ సమస్యలు పరిష్కరించ లేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్ళైనా బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేకపోవడం బాధాకరమన్నారు. బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఏర్పాటు డిమాండ్‌కి మద్దతునిచ్చిన మొదటి నేత సీఎం కేసీఆరే‌నని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికీ 18 రాష్ట్రాల్లో ఒక్క బీసీ ఎంపీ కూడా లేడని కృష్ణయ్య అన్నారు. రైల్వే, ఎల్ఐసీలను ప్రైవేట్​పరం చేసి ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో ఛలో ఢిల్లీ ద్వారా గ్రామగ్రామానికి ఉద్యమాన్ని తీసుకెళతామన్నారు.

ప్రభుత్వాలు కదిలొస్తేనే బీసీలకు న్యాయం : ఎల్.రమణ

ప్రభుత్వంలో కదలిక వచ్చి బీసీ వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండేలా రిజర్వేషన్లు అమలు చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని టీటీడీపీ ప్రెసిడెంట్​ ఎల్.రమణ అన్నారు. స్థానిక సంస్థల్లో ఉన్నట్లే అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీసీలకు ప్రాతినిధ్యం కల్పించేలా చూడాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story