తెలంగాణ సర్కారుకు మంత్రి షాక్

by Anukaran |   ( Updated:2021-03-11 04:46:35.0  )
TRS MInistar
X

కోట్లు పోసి కొన్న భూమి సర్కారు ఖాతాలోకి వెళ్లింది. ఆ భూమికి ధరణి పోర్టల్ ఆటోలాక్ వేసింది. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నా.. అధికారులతో పనికావడం లేదు. దీంతో ఆయన ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తహసీల్దార్ మొదలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ఏడుగురిని ప్రతి వాదులుగా పేర్కొంటూ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. కేబినెట్ లో ఉండి తాను ఆమోదించిన చట్టంపైనే కేసు వేయడం గమనార్హం. సాక్షాత్తూ ఒక మంత్రికే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే సామాన్యుల పరిస్థతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంపై ఓ మంత్రి పోరాడుతున్నారు. ప్రభుత్వంలోనే ఉంటూ పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ఆయనకు అనివార్యమైంది. ఉత్తర ప్రత్యుత్తరాలతో ఎలాంటి ఫలితం రాలేదు. అధికారులను బతిమాలినా, బెదిరించినా.. రికార్డులను చూపించినా పని కాలేదు. కోట్ల రూపాయల విలువజేసే భూమి హక్కులపై పేచీలు వచ్చిపడ్డాయి. డబ్బులు పెట్టి కొన్న భూములు కూడా ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లిపోయాయి. కొనేటప్పుడే అన్ని రికార్డులనూ సరిచూసుకున్నారు. స్టాంపు డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కానీ చివరికి ఆ భూమి ఆయన ఖాతాలోకి కాకుండా సర్కారు లెక్కల్లోకి వెళ్ళిపోయింది. మంత్రిగా ఉన్నా అధికారుల ద్వారా పని కాకపోవడంతో న్యాయపోరాటానికి దిగారు.

కేబినెట్ లో ఉండి ఆమోదించి.. ఇప్పుడు కేసు

భూమి హక్కులు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు ససేమిరా అంటున్నారు. అంతా కొత్త చట్టం మహిమ. ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగి మంత్రి విసిగిపోయారు. ఆయన సభ్యుడిగా ఉన్న మంత్రివర్గమే ఆమోదించిన కొత్త ఆర్వోఆర్ చట్టం (తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాలు, 2020) చిక్కులు తెచ్చి పెట్టింది. చట్టాన్ని కాదనలేక మౌనంగా ఉండిపోయారు. కోట్లాది రూపాయల భూమి చేజారిపోతూ ఉంటే తట్టుకోలేకపోయారు. అందుకే తహశీల్దార్ మొదలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ఏడుగురిని ప్రతివాదులుగా పేర్కొంటూ హైకోర్టు మెట్లు ఎక్కారు. స్వయంగా తాను ఆమోదించిన చట్టాన్నే సవాలు చేశారు. మంత్రిగా ఉంటూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడం బహుషా తెలంగాణలో మొదటిదేమో. ఓ మంత్రికే కొత్త ఆర్వోఆర్ చట్టం, ధరణి పోర్టల్ ఇలాంటి చిక్కులు తెస్తే ఇక సామాన్యులు పడే ఇబ్బందులు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. అధికారుల స్థాయిలో భూముల పంచాయతీలు పరిష్కారం కావడంలేదనేదానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. క్షణాల్లో పని అయిపోయేలా ‘ధరణి’ తీసుకొచ్చామంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా.. సాక్షాత్తూ మంత్రికే చేదు అనుభవం ఎదురైంది.

అంతా కొత్త చట్టం మహిమ!

స్థానిక తాసీల్దారు స్థాయిలో కావాల్సిన పనికి నెలలు, సంవత్సరాలు పడుతున్నది. లాయర్ ఫీజు, కోర్టు ఖర్చులు భరించే శక్తి ఉన్న మంత్రి కోర్టుకు వెళ్లగలరేమోగానీ సామాన్యుల సంగతేంది అన్నది చర్చనీయాంశమైంది. ప్రభుత్వ, ఉన్నతాధికారుల హడావిడి నిర్ణయాలతో లక్షలాది మందికి వారి భూములపై హక్కులు ప్రశ్నార్థకమయ్యాయని ఆరోపణలు వస్తున్న సమయంలో మంత్రి వ్యవహారం రూఢీ చేసినట్లయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ప్రతిష్ఠాత్మకం’ అని చెబుతున్న ‘ధరణి’ లక్షలాది మందిని చిక్కుల్లోకి నెట్టింది. ఆ స్థలం వివాదాస్పద భూముల జాబితాలో ఉన్నందునే ఈ భూమి విషయంలో మంత్రి కోరుకున్నట్లుగా పని చేయడం అధికారులకు సాధ్యం కాలేదు. చట్టంలో పేర్కొన్న ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని తాసీల్దారు మొదలు కలెక్టర్ వరకు చెబుతుండటంతో మంత్రి కూడా ఏమీ చేయలేకపోయారు. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం లక్షలాది ఎకరాల భూములు వివాదాస్పద జాబితాలో చేరాయి. ఇప్పటికీ వాటికి మోక్షం కలగలేదు. మంత్రి భూమి కూడా అలాంటి భూముల్లో ఒకటి. రికార్డులపరంగా, చట్టబద్ధంగా న్యాయం చేసేందుకు అధికారులకు అవకాశం ఉన్నా ‘ఆన్‌లైన్’ విధానంలో ఆప్షన్లు లేవు. కోర్టుకు వెళ్ళడం తప్ప మంత్రికి మరోమార్గం లేకపోయింది.

నాడు క్షీరాభిషేకాలు చేసి..

ధరణి పోర్టల్ బ్రహ్మాస్త్రం అంటూ కీర్తించి, సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసిన మంత్రి సడెన్ గా ప్లేటు ఫిరాయించి కోర్టు మెట్లెక్కడం. హైకోర్టులో కేసు దాఖలు చేయడం విశేషం. ఈ విషయం బయటికి పొక్కి.. ముఖ్యమంత్రి వరకూ వెళితే.. తన మంత్రి పదవి ఏమవుతుందో అనే భయం సదరు మంత్రి వర్యులను వెంటాడుతున్నది. ఇటీవలి కాలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఆ భూమిని వదులుకునేందుకు ఆయనకు మనసు రావడంలేదు. ప్రభుత్వ అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నందున పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత సీఎంకు తెలిస్తే మంత్రి ఏ విధంగా సర్దిచెప్పుకుంటారో అనేది.. ఆసక్తికరంగా మారింది.

వారం రోజుల్లో సవరణ

రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన కాల పరిమితి చార్టును రూపొందించింది. దాని ప్రకారం పీవోబీ జాబితాను సవరించేందుకు కేవలం వారం రోజులే గడువు ఇచ్చారు. ఆ చార్టు జారీ చేసి నెల రోజులకు పైగా అయింది. ఇప్పటి వరకు ఏ ఒక్క దరఖాస్తునూ పరిష్కరించలేదు. కనీసం పరిశీలించనే లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా చేయాల్సిన కలెక్టర్లు నిషేధిత భూముల జాబితాలో ఇరుక్కుపోయి హక్కులు కల్పించండంటూ బోరుమంటోన్న దరఖాస్తుదారులకు న్యాయం చేసేందుకు తాత్సారం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అందుకే మంత్రి కూడా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed