సహ ‘కారు’లో కారాలు మిరియాలు

by Ramesh Goud |
సహ ‘కారు’లో కారాలు మిరియాలు
X

అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూపల్లి, హర్షవర్ధన్‌రెడ్డి మధ్య పోరు జరగ్గా ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మధ్య నడుస్తోంది. ఇద్దరు నేతలు ఢీ అంటే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సూచించిన పెద్దలే చక్రం తిప్పుతుండగా గుండ్రాతిమడుగు సొసైటీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా టీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ నెలకొని చర్చ నీయాంశమైంది. మంత్రి సత్యవతి రాథోడ్ స్వగ్రామం గుండ్రాతిమడుగు కావడంతో ఆమె ముఖ్య అనుచరుడైన జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి తన అనుచరులను పోటీలో నిలిపి సొసైటీ డైరెక్టర్ల గెలుపు కోసం అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఛైర్మన్ అభ్యర్థిగా బండి బుచ్చిరెడ్డి ని ప్రకటించారు.

అటు.. ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాత్రం ఛైర్మన్ అభ్యర్థిగా గార్లపాటి వెంకట్‌రెడ్డిని ప్రకటించడంతో వర్గపోరు కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అన్ని స్థానాలకు అభ్యర్థుల గెలిపించుకొని మంత్రిపై పై చేయి సాధించాలనే పట్టుదలతో ఉండటంతో జిల్లా వ్యాప్తంగా మంత్రి, ఎమ్మెల్యే తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకే పార్టీ నుంచి మంత్రి, ఎమ్మెల్యే వర్గీయులు సహకార ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులను బరిలో నిలపి ఆసక్తిని రేకెత్తించడంతో రాష్ట్రం మొత్తం గుండ్రాతిమడుగు వైపే చూస్తోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువురు మూడు దశాబ్దాలుగా వైరి వర్గాలుగా ఉండి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో సత్యవతి రాథోడ్‌కు మంత్రి పదవి వరించడంతో రెడ్యా నాయక్‌, ఆయన వర్గీయులు జీర్ణించుకోలేపోతున్నారు. ఇంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వైషమ్యాలు సహకార సంఘం ఎన్నికల్లో ఒక్కసారిగా బయట పడటంతో జిల్లాలో ఎక్కడ నలుగురు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story