రెండు లక్షల ఎకరాలకు సాగునీరు : మంత్రి వేముల

by Shyam |
Minister Vemula Prashanth Reddy
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కాళేశ్వరం ప్యాకేజ్ 20, 21 పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని రెండు లక్షల మెట్ట భూములకు సాగునీరు ఇచ్చే కార్యక్రమాల పనులు కొనసాగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో నీటిపారుదల రెవెన్యూ శాఖల అధికారులతో ఈ ప్యాకేజీ పనుల పురోగతిపై సమీక్షించి మీడియాతో మాట్లాడారు. ఈ నియోజకవర్గాల పరిధిలోని మెట్ట ప్రాంత భూములకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా బినోల నుండి నీటిని తీసుకొచ్చి సారంగాపూర్ వద్ద పంపు హౌస్ ఏర్పాటు చేసి టన్నెల్ ద్వారా నీటిని పంపిణీ చేయడానికి పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. సారంగాపూర్ పంప్ హౌస్ వద్ద మోటార్లు బిగించి రెండు నెలల్లో వెట్-రన్ చేయుటకు సిద్ధంగా ఉన్నాయని, మిగతా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

అక్కడి నుండి పాత నిజాంసాగర్ కెనాల్ నుండి నీటిని ఎత్తిపోసి ఒక లైన్ మంచిప్ప చెరువుకు, మరో లైన్ మెంట్రాస్పల్లి పైప్లైన్ ద్వారా నీటి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మెంట్రాస్పల్లి పంప్ హౌస్ నుండి ఆర్మూర్, బాల్కొండ, మెట్పల్లి పంప్ హౌస్‌కు నీటిని పంపడం జరుగుతుందని, ఈ పనులు వెంటనే పూర్తిచేసి ఒక నెలలో వెట్‌రన్ కోసం సిద్ధం చేయడానికి అధికారులను ఆదేశించామని తెలిపారు. మెంట్రాస్పల్లి నుండి తొమ్మిది ఫీట్ల మెడల్‌తో మెయిన్ పైప్ లైన్ ద్వారా ఆర్మూర్ బాల్కొండ మెట్పల్లి మెయిన్ పైపు లైన్ పనులను కూడా 90 కిలోమీటర్ల లెంత్‌తో పనులు అయినాయని, పనులు జరుగుతున్నాయని ఈ పనులు గత సీజన్‌లోనే పూర్తి చేసి 20వేల ఎకరాలకు నీటిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కరోనా వల్ల పనులకు ఆటంకం కలిగిందన్నారు. జనవరి నెలలో జక్రాన్ పల్లి మండలం 14 గ్రామాల్లోని 14 వేల ఎకరాలకు, వేల్పూర్ మండలం నాలుగు గ్రామాల్లోని ఆరు వేల ఎకరాలకు మొత్తం 20 వేల ఎకరాలకు నీటిని అందించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు.

మాసాని చెరువు నుండి మంచిప్పకు వెళ్లే లైన్‌లో ఫీడర్ హౌస్ పనులు నవయుగ కంపెనీ నిర్వహిస్తున్నదని, ఆగస్టులో నీరు పోసే విధంగా పనులు సాగుతున్నాయన్నాయని ఆయన తెలిపారు. అదేవిధంగా మంచిప్ప నుండి నీటిని ఎత్తిపోయటానికి రెండో పంప్ హౌస్ పనులు కూడా కొనసాగుతున్నాయని ఆగస్టు నెలలో నీటిని బయటకు పంపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నామని వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ రైతులకు సాగునీరు అందించడానికే కాబట్టి రైతులు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ రావు, ఆర్డీఓ రవి, నీటి పారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed