నాలుగేండ్లలో 3లక్షల ఉద్యోగాల కల్పన : కేటీఆర్

by Shyam |
నాలుగేండ్లలో 3లక్షల ఉద్యోగాల కల్పన : కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రానున్న నాలుగేండ్లలో రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్​ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సెషన్​లో భాగంగా శనివారం సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ రానున్న నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని వివరించారు. స్థానికులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ఎలక్ట్రానిక్‌ సిస్టమ్ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 60 వేల మందికి దీనికి సంబంధించి శిక్షణ ఇవ్వగా.. 30 వేల మందికి ఉపాధి లభించిందని కేటీఆర్‌ తెలిపారు.

రాష్ట్రానికి కొత్తగా 40 పరిశ్రమలు వచ్చాయని, రూ.2 నుంచి రూ.30 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ ఇస్తున్నామని కేటీఆర్‌ వివరించారు. దివిటిపల్లి, చందన్‌వెల్లిలో విద్యుత్‌ వాహనం, ఇంధన నిల్వ వ్యవస్థల అభివృద్ధికి రెండు కొత్త పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో పరిణామాలు తెలుసుకునేందుకు ప్రత్యేక నిపుణుల బృందం, స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశామని కేటీఆర్‌ సభలో పేర్కొన్నారు.

100 రోజుల్లోనే 12,943 భవనాలను అనుమతి..

టీఎస్‌ బీపాస్‌ ప్రారంభించిన వంద రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతినిచ్చామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శాసనసభలో వెల్లడించారు. భవన నిర్మాణ అనుమతులు తొందరగా ఇచ్చేందుకే టీఎస్​ బీపాస్​ తీసుకొచ్చామని, బీపాస్​ కింద వచ్చిన అప్లికేషన్లలో 80శాతానికి పైగా నిర్మాణాలు వెంటనే అనుమతులిచ్చినట్టు ఆయన తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి ఆరొందల గజాల వరకు స్వయం దరఖాస్తుల ఆధారంగా ఆన్‌లైన్ అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ఆన్‌లైన్‌లోనే ఆక్యుపెన్సీ ధృవపత్రం సైతం జారీ చేస్తున్నామని తెలిపారు. కేపీహెచ్‌బీలో ఇండ్ల పునర్నిర్మాణానికి ఉచితంగా అనుమతులు కల్పించాలంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేయగా.. పరిశీలిస్తామని మంత్రి హామీనిచ్చారు. ఎంఏయూడీలో రెండొందల ఉద్యోగాలను తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ద్వారా భర్తీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

Advertisement

Next Story