డెంటల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం అభినందనీయం

by Sridhar Babu |
డెంటల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం అభినందనీయం
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన ఆరేండ్లకు డెంటల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కోఠి డీఎంహెచ్ఎస్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

ఉమ్మడి రాష్ట్రంలో కోర్టు కేసుల మూలంగా డెంటల్ కౌన్సిల్ ను నాటి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం సీఎం కేసీఆర్ చూపిన చొరవతోనే కోర్టు కేసులు పరిష్కారమయ్యాయనీ, దీంతో డెంటల్ కౌన్సిల్ ఏర్పాటు చేశారని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వైద్యుడు డాక్టర్ రాజేష్ రెడ్డిని తెలంగాణ డెంటల్ కౌన్సిల్ అధ్యక్షుడుగా నియమించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు డెంటల్ కౌన్సిల్‌లో 15 వేల మంది వైద్యులు రిజిస్టర్ చేయించుకున్నారని మంత్రి అన్నారు.

మాట్లాడకుండానే వెళ్లిపోయిన మంత్రి ఈటెల…

డెంటల్ కౌన్సిల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ విచ్చేస్తున్నారని సమాచారం ఉన్నప్పటికీ ఆయన వచ్చే వరకు ఎదురుచూడకుండా డెంటల్ కౌన్సిల్ ను ఈటల ప్రారంభించారు. అనంతరం కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ రాజేశ్ రెడ్డి ఛాంబర్‌లో ఆయన కూర్చుని ఉన్న సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్కడికి వచ్చారు. దీంతో అక్కడ ఉన్న కౌన్సిల్ సభ్యులు, ఇతర నాయకులు, అధికారులు శ్రీనివాస్ గౌడ్ ను స్వాగతించేందుకు వెళ్లారు. కాగా మంత్రి ఈటల లేచి అక్కడి నుండి మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. అక్కడున్న వారు ఆగమని కోరినప్పటికీ వినకుండా ఈటల వెళ్లిపోయారు. దీంతో మంత్రులు ఇద్దరి మద్య విభేదాలున్నాయన్న చర్చ తెరమీదకు వచ్చింది.

Advertisement

Next Story