కరోనా కేసులు ఇంకా పెరుగుతాయి

by Shyam |
కరోనా కేసులు ఇంకా పెరుగుతాయి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రానున్న కాలంలో రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పెరుగుతాయని, ఆ భారాన్ని తట్టుకునే విధంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సమాయత్తమవుతూ ఉన్నదని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. గాంధీ ఆసుపత్రిని సోమవారం సందర్శించి అక్కడ కరోనా పేషెంట్లకు అందుతున్న చికిత్స, వైద్య ఉపకరణాల లభ్యత, వైద్య సిబ్బంది కొరత, పేషెంట్లకు ఉన్న సౌకర్యాలు, మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించడానికి ఉన్న మార్గాలు తదితర పలు అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు వివిధ విభాగాల హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహించారు. గాంధీ ఆసుపత్రిని కరోనా పేషెంట్ల కోసమే కేటాయించినందున రాష్ట్రంలోని కరోనా భారమంతా ఈ ఆసుపత్రిపైనే పడిందని, దీనికి అనుగుణంగా వైద్య సిబ్బందిని అదనంగా నియమించుకోవాల్సి వస్తోందని, బెడ్‌ల సంఖ్యను కూడా పెంచాల్సి వస్తోందని అన్నారు. అదనపు సిబ్బందిని నియమించుకునే బాధ్యతను వైద్య విద్య డైరెక్టర్‌కు అప్పగించారు. ఐసీయూ, ఆక్సిజన్ వార్డుల్లో ఉన్న 13మంది పేషెంట్లకు ప్లాస్మా థెరఫీ ఇస్తే ఇద్దరు మినహా మిగిలినవారంతా కోలుకుని క్షేమంగా ఉన్నారని మంత్రి తెలిపారు.

ఆసుపత్రిలోని సుమారు రెండు వేల బెడ్‌లలో సగం ఐసీయూ వార్డులకే పరిమితమైపోయాయని, పేషెంట్లకు మరింత మెరుగైన సేవలు అందడానికి అదనంగా అకడమిక్ బ్లాక్‌లో 200బెడ్‌లను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. పేషెంట్ల దగ్గరకు డాక్టర్లు వెళ్ళడంలేదని నర్సులతో పాటు సాధారణ ప్రజానీకం నుంచి కూడా ఫిర్యాదులు వస్తుండడంతో ఇకపైన డాక్టర్లంతా విధిగా బెడ్ దగ్గరికే వెళ్ళాలని ఆదేశించడంతో పాటు ప్రతీ ఐసొలేషన్ వార్డుకు ఒక హెచ్ఓడీకి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. వైద్యులు లేదా వైద్య సిబ్బంది వ్యక్తులుగా కాకుండా మొత్తం ఒక వ్యవస్థగానే పనిచేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని మంత్రి నొక్కిచెప్పారు. వార్డుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకంపై గతంలో చేసిన కామెంట్లను సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఇకపైన పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులను ఆసుపత్రి సిబ్బందే నేరుగా ఆ పేషెంట్ల కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియజేయాలని ఆదేశించి ఇందుకోసం సమన్వయకర్తలను నియమించుకోవాలని స్పష్టం చేశారు.

వార్డుల్లో వెంటిలేషన్‌కు ప్రత్యేక ఏర్పాట్లు

పేషెంట్లు ఉంటున్నవార్డుల్లో ఎప్పటికప్పుడు గాలి రీసైకిల్ అయ్యేలా పక్కగా వెంటిలేషన్ సౌకర్యం ఉండాలని, ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేని వార్డుల్లో ప్రత్యేకంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లు, ఇతర ఉపకరణాలను ఏర్పాటు చేసి కల్పించుకోవాలని ఆసుపత్రి నిర్వాహకులకు మంత్రి స్పష్టం చేశారు. పేషెంట్లను డాక్టర్లు బెడ్ దగ్గరకు వెళ్ళి చూడడమే కాకుండా దూరం నుంచి కూడా వారి అవసరాలను తెలుసుకునే విధంగా ఆధునిక పరికరాలను కూడా సమకూర్చనున్నట్లు తెలిపారు. ప్రతీ పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి వీలు కలుగుతుందన్నారు. పారిశుద్య అవసరాలకు సైతం అధునాతన యంత్రాలను వినియోగించనున్నట్లు తెలిపారు. వీలైనంతవరకు ఆధునిక టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పేషెంట్లను బతికించడం, వీలైనంతగా మరణాలను తగ్గించడంపైనే వైద్య సిబ్బంది, అధికారుల దృష్టి ఉండాలని నొక్కిచెప్పారు.

రాష్ట్రమంతటా కరోనా చికిత్సకు ఒకే ప్రోటోకాల్

ప్రపంచవ్యాప్తంగా కరోనా చికిత్సకు అందుబాటులో ఉన్న పద్ధతులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తామని మంత్రి ఈటెల తెలిపారు. అంటు వ్యాధుల పట్ల నైపుణ్యం గల డాక్టర్లతో తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లు, చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మంత్రి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా స్పష్టం చేశారు. కరోనాకు రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం (ప్రోటోకాల్) ఉండాలని స్పష్టం చేశారు. కరోనా వచ్చినవారు జబ్బుతో కంటే భయంతో ఎక్కువ మంది చనిపోతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పాజిటివ్ పేషెంట్లలో ధైర్యం నింపాలని సూచించారు. యాంటీ వైరల్ మందులకంటే స్టెరాయిడ్ మందులు ఎక్కువ మందికి నయం చేస్తాయని, సీటీ స్కాన్ వల్ల ప్రయోజనం లేదని, ఎంత తొందరగా చికిత్స మొదలుపెడితే మరణాలను ఆ మేరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల వైద్యులు డాక్టర్ విజయ్ ఎల్దండి, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎంవీ రావు, డాక్టర్ సునీత, చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, నిమ్స్ వైద్యులు గంగాధర్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed