IIP Data: ఇకపై ప్రతి నెలా 28వ తేదీన ఐఐపీ డేటా విడుదల

by S Gopi |
IIP Data: ఇకపై ప్రతి నెలా 28వ తేదీన ఐఐపీ డేటా విడుదల
X

దిశ, బిజినెస్ బ్యూరో: పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకమీదట ఏదైనా నెలకు సంబంధించిన ఐఐపీ గణాంకాల వెల్లడిని 42 రోజుల నుంచి 28 రోజులకు కుదించింది. ఈ మేరకు గురువారం గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ నుంచి అమలవుతుంది. ఇక మీదట ప్రతి నెల 28వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఐఐపీ డేటా విడుదలవుతుంది. సంబంధిత నెల ఐఐపీ డేటా ఆ నెల పూర్తయిన 28 రోజుల్లోగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం, మంత్రిత్వ శాఖ ప్రతి నెల 12వ తేదీన నిర్దిష్ట నెలకు చెందిన ఐఐపీ డేటాను ఆరు వారాలలోపు విడుదల చేస్తోంది. అదే విధంగా నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్ఎస్ఎస్) సర్వే నివేదికలు ఇప్పుడు ఫీల్డ్‌వర్క్ పూర్తయిన 90 రోజులలోపు విడుదల చేయనున్నారు. కాగా, ఫిబ్రవరి నెలకు సంబంధించి గతవారం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ఐఐపీ ఆరు నెలల కనిష్టం 2.9 శాతంగా నమోదైంది. అంతకుముందు జనవరిలో ఇది 5.2 శాతంగా ఉంది.



Next Story

Most Viewed