ట్రోల్స్‌పై మంత్రి అనిల్ ఫైర్… చెత్తగాళ్లంటూ తీవ్ర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2021-12-02 02:40:14.0  )
ట్రోల్స్‌పై మంత్రి అనిల్ ఫైర్… చెత్తగాళ్లంటూ తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి టీడీపీ నేతల ట్రోల్స్‌పై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఘాటుగా స్పందించారు. పోలవరంపై టీడీపీ నేతలు చేస్తున్న ట్రోల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పిన దేవినేని ఉమా చేతులెత్తేశాడని, అతనిపై ఎందుకు ట్రోల్ చెయ్యరని ప్రశ్నించారు. పోలవరంపై నెటిజన్లు ఎవరూ ట్రోల్ చేయడం లేదని, అంతా టీడీపీ నేతలే చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేదని, దమ్ముంటే వాస్తవాలు ట్రోల్‌ చేయాలని సవాల్‌ విసిరారు. గూడూరు లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, గత ప్రభుత్వం తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమైందని అది వదిలేసి నన్ను పేటీఎం బ్యాచ్ దాని మీద కథనాలు వండి వార్చి.. ట్రోల్స్ చేసినంత మాత్రాన నాకు ఏమీ కాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా సమాధానం చెప్పారు.

టీడీపీ చెంచా మీడియా అసత్య కథనాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. గతంలో దేవినేని ఉమా కూడా రాసిపెట్టుకో అంటూ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు ట్రోల్ చేయడం లేదన్నారు. కుల గజ్జితో అతడిని వదిలేసి తమపై విమర్శల దాడికి పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. తమపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ డిసెంబర్ కి పూర్తి కాకపోవడానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణమని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పోలవరం ఎందుకు ఆలస్యమైందో మీకు తెలియదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. డయా ఫ్రమ్ వాల్, కాంక్రీట్ వాల్ నాణ్యత లోపం వాస్తవం కాదా అని నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed