రేవంత్ భాష మార్చుకో.. నాలుక తెగ్గొస్తా.. : ఇంద్రకరణ్ రెడ్డి

by Shyam |
Indrakaran Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రేవంత్ రెడ్డి.. వ్యక్తిగతంగా మాట్లాడితే నాలుక తెగ్గోస్తానని దేవాదాయశాఖ మంత్రి అల్లొల ఇంద్రకర్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ ఎంపీ నగేష్, మాజీ ఎమ్మెల్యే మారెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇంద్రవెల్లి సభలో తనపై వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఏవిధమైన భాష మాట్లాడాలో తెలుసుకోవాలని సూచించారు. సభలో ఏం మాట్లాడుతున్నాడో తెలియక హాజరైన సీనియర్ నాయకులకే ఏం చేయాలో అర్ధం కాలేదన్నారు. 1981లో గిరిజనులను కాల్చిచంపిది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. పెద్దపెద్ద మాటలు మాట్లాడి విమర్శలు చేస్తే పేరు రాదని… ప్రజలు చీకొడతారన్నారు. పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు సీఎం హామీ ఇచ్చారని, త్వరలోనే అందజేస్తారన్నారు.

పోడుభూములపై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి… మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, దళితబంధుతో దళితులంతా సంతోషంగా ఉన్నారన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. దళితులకు ఏం చేస్తావో..? ఇప్పటి వరకు ఏం చేశావో… ఏం చేయబోతున్నావో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై, ప్రభుత్వంపై మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

Advertisement

Next Story