భూ లావాదేవీల పారదర్శకత కోసమే ‘ధరణి’

by Anukaran |   ( Updated:2020-10-29 07:05:15.0  )
భూ లావాదేవీల పారదర్శకత కోసమే ‘ధరణి’
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: రాష్ట్ర చరిత్రలో భూలావాదేవీల్లో సరికొత్త అంకం ప్రారంభం అయిందని, ఎలాంటి అవకతవకలు లేకుండా అత్యంత పారదర్శకంగా రెవిన్యూ సేవలు అందించాలనే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను రూపొందించి ప్రారంభించడం జరిగిందని మంత్రి అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండల ఆఫీస్‌లో ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. అందులో భాగంగా మంత్రి అజయ్ కుమార్ దత్తత మండలం ఖమ్మం నియోజకవర్గం రఘునాథ‌పాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో కలిసి ధరణి పోర్టల్‌ను వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కర్ణాటక రాష్ట్రం రెవిన్యూ చట్ట సవరణ చేయాలని తలచినప్పటికి అమలు చేయలేకపోయింద‌న్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచ‌న‌ కార్య‌రూపం దాల్చింద‌న్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 570 తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని ఇప్పటికే సిబ్బందికి ప్రభుత్వం శిక్షణ పూర్తి చేసిందన్నారు. ఈరోజు నుంచే స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారని, నవంబర్ 2నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయన్నారు. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో పాటు మ్యుటేషన్లు ఒకేసారి జరగనున్నాయని, కోటి 55 లక్షల ఎకరాల వ్యవసాయ భూముల వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేయడం జరిగిందన్నారు. ఇక నుంచి పోర్టల్ ద్వారానే భూక్రయవిక్రయాలు జరగనున్నాయని, అవకతవకలకు ఆస్కారం లేని.. పూర్తి పారదర్శక విధానంలో సేవలందేలా ధరణి పోర్టల్‌ రూపొందించబడిందన్నారు.

Advertisement
Next Story

Most Viewed