ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకుంటాం

by Shyam |
ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకుంటాం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనాతో చనిపోయిన టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, అధికారుల కుటుంబాలను ఆదుకుంటామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. కరోనా బారిన పడి సంస్థ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా బాధిత ఉద్యోగులను సంస్థ తరపున ఆదుకుంటామని వారికి అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నామని, వారి చికిత్సకు అవసరమైన కిట్లు అందజేసేందుకుగాను ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చామని తెలిపారు. ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడడం, అవనరమైన మేరకు సబ్బుతో చేతులను శుభ్రపరుచుకోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం లాంటి జాగ్రత్తలను నిరంతరం పాటిస్తే కరోనా బారి నుంచి ఎవరిని వారు కాపాడుకోవచ్చని సూచించారు. బాధితులు ఎవరూ అధైర్య పడవద్దని, చికిత్స అందించడానికి గాంధీ ఆసుపత్రి, గచ్చిబౌలిలోని టిమ్స్ హాస్పిటలో మెరుగైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ధైర్యమే ముఖ్యమని, దిగులు చెందకుండా ప్రాథమిక దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం లేకుండా బయటపడవచ్చని పేర్కొన్నారు. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story