కార్మికులు రాష్ట్రాలు దాటకూడదు : కేంద్రం

by vinod kumar |
కార్మికులు రాష్ట్రాలు దాటకూడదు : కేంద్రం
X

న్యూఢిల్లీ: గతనెల 25వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌‌తో ఏ రాష్ట్రంలోని వలస కార్మికులు ఆ రాష్ట్రాల్లోనే చిక్కుకుపోయారు. వారిని స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను సర్కారు చేయలేదు. దీంతో పనిలేక, తిండి లేక తిరుగుపయనమయ్యేందుకు రవాణా సదుపాయాలు లేక వలస కార్మికులు పడ్డ కష్టాలను చూశాం. 14వ తేదీ తర్వాతైనా లాక్‌డౌన్ ఎత్తేస్తే స్వగ్రామాలకు చేరవచ్చుననుకున్న వారి ఆశలు మళ్లీ నిరాశలుగా మారాయి. లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించడంతో స్వస్థలాలకు పంపించాలని వలస కార్మికులు నిరసనలూ చేశారు. కానీ, సర్కారు అందుకు అంగీకరించలేదు. అయితే, ఏ రాష్ట్రంలోని వలస కార్మికుల యోగక్షేమాలను ఆ రాష్ట్రాల ప్రభుత్వాలే చూసుకోవాలని కేంద్రం ఆదేశించింది. దీంతో షెల్టర్‌లు, రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి.. వలస కార్మికులను అందులోకి తరలించారు. అయితే, ఈ నెల 20 తర్వాత లాక్‌డౌన్ నిబంధనలను పాక్షికంగా సడలించబోతున్నట్టు కేంద్రం ప్రకటించడంతో వలస కార్మికులు మరోసారి ఆశలు పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి హామీ పనులు, ఇతర పనులకు కేంద్రం మినహాయింపులనిచ్చింది. కానీ, వలస కార్మికులు రాష్ట్రాలు(యూటీలు కూడా) దాటి పోరాదని కేంద్రం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఆశ్రయాల్లో ఉంటున్న వలస కార్మికులు తప్పకుండా సమీపంలోని సంబంధిత అధికారులను కలిసి వారు చేయదలిచిన పనుల గురించిన వివరాలను తప్పకుండా సమర్పించాలని ఆదేశించింది. దీంతో వారికి తగిన పనులు.. సమీపంలో వెతికిపెట్టేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరని, వారిని ఇండస్ట్రియల్, తయారీ, నిర్మాణ, సాగు, ఉపాధి హామీ పనుల్లోకి తీసుకోవడం జరుగుతుందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. అయితే, అదే రాష్ట్రంలోని తమ స్వస్థలాలకు వెళ్లే కార్మికులను కరోనా పరీక్షలు జరిపి పంపించాలని సూచించింది. అలాగే, కరోనావైరస్ లక్షణాలు లేనివారినే పనులకు అనుమతించాలని తెలిపింది.

tags: coronavirus, pandemic, home ministry, migrant workers, no transport, interstate

Advertisement

Next Story