సరికొత్త ఫీచర్లతో ఎస్‌యూవీ 'ఆస్టర్' లాంచ్

by Harish |
సరికొత్త ఫీచర్లతో ఎస్‌యూవీ ఆస్టర్ లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ కంపెనీ తన ఎస్‌యూవీ ‘ఆస్టర్‌’ను సోమవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఏఐ ఆధారిత టెక్నాలజీ ఇందులో ఉపయోగించినట్టు కంపెనీ వెల్లడించింది. రూ. 9.78 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలో పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారును తీసుకొచ్చామని, ఈ ఎస్‌యూవీని నాలుగు వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ వేరియంట్లలో లభించే ఈ మోడల్ ధరలు రూ. 9.78 లక్షల నుంచి రూ. 16.78 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్న హ్యూండాయ్ క్రెటా, మారుతీ సుజుకి నుంచి బ్రెజా, నెక్సా ఎస్‌క్రాస్ మోడళ్ల వంటి మిడ్-రేంజ్ ఎస్‌యూవీ విభాగంలోని కార్లకు ఆస్టర్ పోటీ ఇవ్వనున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఎంజీ మోటార్ ‘ఆస్టర్’ కోసం అక్టోబర్ 21 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని, ఈ ఏడాది ముగిసే నాటికి దేశవ్యాప్తంగా 5,000 కార్లను విక్రయించాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు కంపెనీ వివరించింది. అత్యాధునిక సాంకేతికతతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఆస్టర్ మోడల్ కారు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లెవెల్ 2 టెక్నాలజీ ఫీచర్లను ఇందులో అమర్చినట్టు కంపెనీ తెలిపింది. మొత్తంగా ఈ మోడల్‌లో 80 రకాల ఏఐ ఫీచర్లను పొందుపరిచినట్టు కంపెనీ పేర్కొంది. ఇంకా, 6ఎయిర్‌బ్యాగులు, 6-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్ సెన్సింగ్ వైపర్, పానరొమిక్ స్కై రూఫ్, 10.1 అంగుళాల హెచ్‌డీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సహా ఇంకా అనేక అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed