లోహాన్ని తిని బతికే బ్యాక్టీరియాలు

by Harish |
లోహాన్ని తిని బతికే బ్యాక్టీరియాలు
X

ఇంగ్లీ‌ష్‌లో ‘జీఐ జో’ అనే ఒక సినిమా ఉంటుంది. అందులో ఒక రకం బ్యాక్టీరియా పారిస్‌లోని పెద్ద ఈఫిల్ టవర్‌ను కొన్ని క్షణాల్లో తినేసి నేలమట్టం చేస్తుంది. అయితే అది కంప్యూటర్ ప్రోగ్రామ్ చేసిన బ్యాక్టీరియా. కాగా, నిజజీవితంలోనూ ఇలాంటి బ్యాక్టీరియాను కాల్‌టెక్ మైక్రోబయాలజిస్టులు కనిపెట్టారు. ఇది పెద్దమొత్తాల్లో లోహన్ని తిని పాడుచేస్తుందని తప్పుగా అనుకోవద్దు. ఇది కేవలం దాని పొట్ట నింపుకోవడానికి మాత్రమే లోహాన్ని తింటుందని వారంటున్నారు. పాడైన స్థితిలో ఉన్న మాంగనీస్ లోహ వస్తువుల మీద తాము ఈ సూక్ష్మ బ్యాక్టీరియాను గుర్తించినట్లు కాల్‌టెక్ పర్యావరణ శాస్త్రవేత్త జేరెడ్ లీడ్‌బెటర్ తెలిపారు.

ఇలా పాడైపోయిన లోహాలను తినగలిగే బ్యాక్టీరియాను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తే ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో భాగంగా పేరుకుపోయిన లోహాన్ని వదిలించుకునే అవకాశం లభిస్తుందని జేరెడ్ వివరించారు. కేవలం లోహాల మీద ఆధారపడి బతకడమే కాకుండా ఈ బ్యాక్టీరియా కీమోసింథసిస్ ప్రక్రియ ద్వారా కార్బన్‌డయాక్సైడ్‌ని బయోమాస్‌గా కూడా మారుస్తోందని, దీని వల్ల పర్యావరణానికి కూడా ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. ఒక్క వ్యర్థాల విషయంలోనే కాకుండా ఫ్యాక్టరీల నుంచి విడుదలైన వ్యర్థాల కారణంగా మాంగనీస్‌తో కలుషితమైన నదీజలాలను కూడా ఈ బ్యాక్టీరియా సాయంతో శుద్ధిచేయవచ్చని మరో పరిశోధకుడు హాంగ్ యూ తెలిపారు. అయితే ఈ బ్యాక్టీరియాకు ఇంకా పేరు పెట్టలేదని వారు తెలిపారు.

Advertisement

Next Story