ఫిలిప్పీన్స్‌లో మెసెంజర్ చదువులు!

by Anukaran |   ( Updated:2020-10-29 07:04:52.0  )
ఫిలిప్పీన్స్‌లో మెసెంజర్ చదువులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ క్లాస్ అంటే ఏంటి? ఫోన్‌లోనో, కంప్యూటర్‌లోనో టీచర్ చెప్పే పాఠాలు వింటూ, మధ్యలో ఏదన్నా డౌటు వస్తే ఆమెను అడిగే అవకాశం కల్పిస్తూ ఇంట్లోనే ఉండి చదువుకోగల క్లాస్. కానీ ఆన్‌లైన్ క్లాస్ సజావుగా జరగాలంటే స్మార్ట్‌ఫోన్, వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. కానీ ఫిలిప్పీన్స్‌లో చాలా మందికి ఈ రెండూ లేవు. దాదాపు 60 శాతం ఫిలిప్పీన్స్ కుటుంబాలకు స్మార్ట్‌ఫోన్ గానీ, కనీసం 2జీ ఇంటర్నెట్ సౌకర్యం గానీ లేదు. ఒకవేళ ఉన్నా అది చాలా కాస్ట్లీ. మరి ఆన్‌లైన్ క్లాసుల జమానాలో ఈ పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్లు అలా వెనకబడి పోవాల్సిందేనా? అవసరం లేదంటోంది ఏహెచ్ఏ లెర్నింగ్ సెంటర్ అంటోంది.

ఫిలిప్పీన్స్‌లోని మకాటి సిటీలో ఉన్న నాన్ ప్రాఫిట్ స్కూల్ ఇది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నిరుపేద విద్యార్థులకు ఇందులో పనిచేసే టీచర్లు పాఠాలు చెప్తారు. అయితే లాక్‌డౌన్ ప్రారంభమయ్యాక పాఠాలు చెప్పే అవకాశం లేకుండా పోయింది. వారి వద్ద చదువుకునే విద్యార్థుల ఇళ్లలో సాధారణ ఫోన్ ఉండటమే చాలా కష్టం, ఇక స్మార్ట్‌ఫోన్ అందని ద్రాక్షే. కానీ వారికి పాఠాలు చెప్పాలి. కానీ ఎలా? విద్యార్థులందరినీ బేసిక్ ఫోన్ కొనుక్కోవాలని చెప్పారు. కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నవారికి ఏహెచ్ఏ లెర్నింగ్ సెంటర్ వారే బేసిక్ ఫోన్ కొనిచ్చారు. ఫోన్ సమస్య తీరింది. మరి తక్కువ బ్యాండ్‌విడ్త్ ఇంటర్నెట్ సమస్య ఎలా?

ఏహెచ్ఏలో పనిచేసే ఉపాధ్యాయులు అందుకు కూడా ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఫేస్‌బుక్ మెసెంజర్ లైట్ వెర్షన్ ద్వారా పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇందులో టెక్స్ట్ మెసేజ్ పంపుకోవడానికి మాత్రమే వీలుంటుంది. ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కావు. కాబట్టి తక్కువ బ్యాండ్‌విడ్త్ ఇంటర్నెట్‌లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే మెసెంజర్ ద్వారా అన్ని సబ్జెక్టులు చెప్పడం సాధ్యమైనా గణితం బోధించడానికి ఇబ్బంది ఎదురైందని గణితం టీచర్ ఏప్రిల్ గార్సియా తెలిపారు. కానీ ఈ సమస్యకు గార్సియా సొంతంగా పరిష్కారం కనిపెట్టింది. గణితంలో ఉండే గుర్తులను ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఉన్న ఎమోజీలతో భర్తీ చేసింది. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు మెసెంజర్ పాఠాలు అలవాటయ్యాయని, కాకపోతే టీచర్ కనిపించకుండా పాఠాలు నేర్చుకోవడానికి ఇబ్బందిగా ఉందని కొందరు విద్యార్థులు అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed