మారుతీ సుజుకి స్విఫ్ట్-2021 వెర్షన్ విడుదల!

by Harish |
మారుతీ సుజుకి స్విఫ్ట్-2021 వెర్షన్ విడుదల!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కొత్త వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో అత్యంత ఎక్కువ ఆదరణ ఉన్న ఈ మోడల్ ధరను రూ. 5.73 లక్షల నుంచి రూ. 8.41 లక్షల(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ) మధ్య నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. క్రితం మోడళ్ల స్పూర్తితో వినియోగదారులు మరింత ఇష్టపడే డిజైన్‌తో పాటు, నూతన సాంకేతికత అవసరాలకు అనుగుణంగా స్విఫ్ట్-2021ను తీసుకొచ్చినట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

‘దేశీయ మార్కెట్లో 2005లో స్విఫ్ట్ మోడల్ ప్రారంభమైనప్పటి నుంచి భారత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త వెర్షన్ స్విఫ్ట్ స్పోర్టివ్ డిజైన్‌తో పాటు, మెరుగైన పనితీరు, ఇంటీరియర్ డిజైన్ సహా అనేక మార్పులతో మరింత భద్రతను ఇచ్చే మెరుగైన ఫీచర్లను కలిగి ఉందని’ మారుతీ సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. స్విఫ్ట్ మోడల్ ఇప్పటివరకు 24 లక్షల కస్టమర్లను సాధించినట్టు ఆయన పేర్కొన్నారు.

కొత్త స్విఫ్ట్‌లో ఐఎస్ఎస్ టెక్నాలజీతో శక్తివంతమైన కె-జనరేషన్ ఇంజిన్‌ను అందిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇందులో మాన్యువల్ వేరియంట్ ధర రూ. 5.73 లక్షల నుంచి రూ. 7.91 లక్షల మధ్య లభించనుండగా, ఆటోమెటిక్ గేర్ వేరియంట్ రూ. 6.86 లక్షల నుంచి రూ. 8.41 లక్షల మధ్య ఉందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed