ప్లాట్లు.. పాట్లు..

by Shyam |   ( Updated:2020-09-21 20:26:38.0  )
ప్లాట్లు.. పాట్లు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూములకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక చట్టం ‘ధరణి’ డేటా ఫైనల్. భూమిపై హక్కులు కోల్పోయిన వారు సివిల్ కోర్టులో తేల్చుకోవాలని కొత్త ఆర్వోఆర్​ చెబుతున్నది. ఈ క్రమంలోనే ‘ధరణి’ డేటా 100 శాతం వాస్తవమేనా? అంటే అదీ లేదంటున్నారు రెవెన్యూ అధికారులు. ఆ డేటాలో తప్పులు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.

హెచ్ఎండీఏ పరిధిలో దశాబ్దాల క్రితమే వేలాది లేఅవుట్లు చేశారు. అప్పుడు గ్రామ పంచాయతీ అనుమతులతో వేలాది ఎకరాలను ప్లాట్లుగా మార్చి దందా చేశారు. కొనుగోలుదారుల వద్ద సేల్ డీడ్లు, లే అవుట్ కాపీలు మాత్రమే ఉన్నాయి. ఒకే ప్లాటు పదుల సంఖ్యలో చేతులు మారి ఉంది. లేఅవుట్లకు రికార్డులను మార్చకపోవడంతో నేటికీ పట్టాభూములుగా చాలామణిలో ఉన్నాయి. వాటికి భూ రికార్డుల ప్రక్షాళనలోనూ పాసు పుస్తకాలు జారీ కావడంతో రైతుబంధు పథకం కింద లక్షల రూపాయలు విడుదలవుతున్నాయి. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేర్లు కూడా లేఅవుట్లకు బదులు పట్టాభూములుగా కొనసాగిస్తున్న జాబితాలో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అలాగే, ‘ధరణి’లో నేచర్ ఆఫ్ ల్యాండ్ కాలమ్‌ను క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా నమోదు చేసిన కారణంగా లక్షలాది సేల్ డీడ్లకు విలువ లేకుండా చేశారు. ప్లాట్లు, సాగు భూముల లావాదేవీలన్నీ ఒక్కచోట ఉన్నప్పుడే ఇన్ని అక్రమాలు జరగ్గా, ఇప్పుడు వేర్వేరు చోట్ల జరిగేట్టు చట్టం రావడంతో భవిష్యత్​ పరిణామాలెలా ఉంటాయో ఊహించుకోవచ్చు.

ఈసీల్లో దేని లెక్క దానికే..

భూములు కొన్నవారెవరూ మ్యూటేషన్‌ చేయించుకోని ఏకైక పొరపాటు నిండా ముంచేస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒకటే భూమి ఇటు వ్యవసాయ భూమిగా, అటు ప్లాటుగా ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు సాగాయి. ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్లలో (ఈసీ) ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా రికార్డులు కనిపిస్తున్నా, వాటినే సాగుభూములుగా మరోసారి రిజిస్ట్రేషన్‌ చేశారు. సాగు భూముల రిజిస్ర్టేషన్​ పాసు పుస్తకాల ఆధారంగా, సేల్‌డీడ్‌/లింక్‌ డాక్యుమెంట్ల ఆధారంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కొనసాగించారు. కళ్ల ముందే లేఅవుట్లు కనిపిస్తున్నా రెవెన్యూ అధికారుల తీరుతో దశాబ్దాలుగా సాగుభూములుగానే చలామణి అవుతున్నాయి. హైదరాబాద్‌ చుట్టూ వేల లేఅవుట్ల పరిస్థితే అందుకు నిదర్శనం. అందుకే వ్యవసాయం భూమి నుంచి పంచాయతీ లేఅవుట్లు, ప్లాట్లు, తర్వాత మళ్లీ వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్‌. తాజాగా అదే భూమిలో హెచ్‌ఎండీఏ అనుమతితో మళ్లీ లేఅవుట్‌ పొందిన ఉదంతాలు. ఇలా ఒక్క ఆస్తికి ఎంత మంది హక్కుదారులుగా మారారో..! ఈ తప్పులకు లోపభూయిష్టమైన రెవెన్యూ రికార్డులేనని కారణమని అధికారులు తేల్చి చెబుతున్నారు.

కొన్ని ఉదాహరణలు

ఘట్ కేసర్ మండలం ప్రతాపసింగారం సర్వే నం.315, 316, 317 లో మలిపెద్ది బుచ్చిరెడ్డికి 25.17 ఎకరాలు ఉంది. ఈ స్థలంలో 1989లోనే 390 ప్లాట్లతో పంచాయతీ లేఅవుట్ చేశారు. ఎల్ఆర్ఎస్ కూడా కట్టుకున్నారు. అదే భూమికి పట్టా పాసు పుస్తకాలు జారీ చేశారు. రైతుబంధు సొమ్ము కూడా తీసుకున్నారు. ప్లాట్ల యజమానులంతా భవానీనగర్ అసోసియేషన్ గా ఏర్పడి న్యాయం చేయాలంటూ కొన్నేండ్లుగా తిరుగుతూనే ఉన్నారు. పట్టాదారులకు రాజకీయ పలుకుబడి ఉండడంతో రెవెన్యూ అధికారులు అటువైపే మద్దతు పలికారు. ‘ధరణి’ కూడా వాళ్ల సమస్యనేం పరిష్కరించలేదు.

ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లో సర్వే నం.127లో 18.33 ఎ, 130లో 17.20 ఎ, 131లో 17.09 ఎ, 132లో 17.14 ఎకరాల వంతున మొత్తం 70.36 ఎకరాలు ఉంది. కానీ సేల్‌డీడ్‌ 3608/1996, 1041/1996, 12197/2006, 11412/2006, 20650/2006, 5530/2006, 8973/2006లను లెక్కిస్తే 73.30 ఎకరాలను విక్రయించినట్లుగా తెలుస్తోంది. సర్వే నం.127, 130, 127, 130, 131, 132ల్లోని చాలా భూములు 30 ఏండ్ల క్రితమే లేఅవుట్లు చేసి విక్రయించారు. వాటినే మళ్లీ సాగు భూములుగా విక్రయించినట్లు ఆధారాలు ఉన్నాయి.

కొండాపూర్‌లో సర్వే నం.96, 97, 112, 113ల్లో 1990 కాలంలోనే వెంకటేశ్వరకాలనీ 1, 2, 3గా లేఅవుట్లు చేసి విక్రయించారు. పట్టాదారులు చనిపోయిన తర్వాత వారసులు పాసు పుస్తకాలు సంపాదించి మరోసారి భూములను విక్రయించారు. దీంతో మళ్లీ లేఅవుట్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సర్వే నం.56/ఇలో 0.11 ఎకరాలు ప్లాట్లుగా మార్చి అమ్మారు. పట్టాదారుడు చనిపోయాడు. తాజాగా ఆయన మనవడు తనదని వాదిస్తున్నట్లు తెలిసింది. సర్వే నం.14, 15, 16, 17, 18ల పేరిట శ్రీవేంకటేశ్వరకాలనీ లేఅవుట్‌ను వేశారు. మొదటి లేఅవుట్‌ ప్రకారం 1,47,609 చ.గ.ల స్థలాన్ని ప్లాట్లుగా, 48,170 గజాలను రోడ్లుగా, 7,497 గజాలను పార్కులు/గుడులకు వదిలేశారు. ఆ తర్వాత లేఅవుట్‌లో 24,986 గజాలు ప్లాట్లుగా, 10,188 రోడ్లుగా, 1152 గజాలు సామూహిక వినియోగానికి వదిలేసినట్లుగా చూపారు. అవే భూములు సాగుభూములుగా మరో ముగ్గురికి విక్రయించారు.

వీళ్లు న్యాయం పొందేదెట్లా?

అంకుషాపూర్‌లో సర్వే నం.194, 195 లో లేఅవుట్‌ చేసి ప్లాట్లు అమ్మేశారు. పట్టాదారులు దానిని మళ్లీ వ్యవసాయ భూమిగా ఇతరులకు విక్రయించారు. హెచ్‌ఎండీఏ ఇప్పుడు అదే భూమికి అనుమతులు ఇవ్వడంతో తిరిగి వాటిని లేఅవుట్లుగా మలిచారు. దాంతో మొదట పంచాయతీ లేఅవుట్‌లో కొనుగోలు చేసిన ప్లాట్ల యజమానులు కోర్టును ఆశ్రయించారు.

అవుషాపూర్‌లో సర్వే నం.14, 15, 16, 17ల పేరుతో రెండు లేఅవుట్లు వెలిశాయి. స్థానిక రియల్టర్లు, బ్రోకర్ల దగ్గర మొదట ప్లాట్లను విక్రయించిన లేఅవుట్‌ మాత్రమే చెలామణిలో ఉన్నది. ఆ తర్వాత 5.06 ఎకరాలతో చేసిన లేఅవుట్‌ కాపీ మాత్రం అందుబాటులో లేకుండా చేయడం గమనార్హం. ఆ స్థలాన్నే వ్యవసాయ భూమిగా విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా, ప్లాట్లు కొనుగోలు చేసిన వారి చేతిలో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు ఉండడంతో లేఅవుట్‌ రద్దయ్యిందంటూ ఓ కంపెనీకి అమ్మారు. ఇప్పుడు అదే భూమిని ఓ నాయకుడి కొడుకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ప్లాట్ల భూముల కొనుగోలు చేసిన ముఠాలు(బాక్స్ ఐటెం)

నగరం చుట్టూ దశాబ్దాల క్రితం లేఅవుట్లు వెలిశాయి. రికార్డుల్లో ప్లాట్లుగా మార్చకుండానే అమ్మేశారు. రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారులే హక్కుదారులుగా ఉన్నారు. ప్రలోభాలకు గురి చేస్తుండడంతో తిరిగి వారే అమ్మేందుకు ముందుకొస్తున్నట్లు ఓ రియల్‌ వ్యాపారి అభిప్రాయపడ్డారు. పాసు పుస్తకాల ఆధారంగా మళ్లీ కొనుగోలు చేసేందుకు ముఠాలు పని చేస్తున్నాయి. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలో కొందరు ఈ దందాతోనే రూ.వందల కోట్లు సంపాదించారు. కాగా, రూ.50 లక్షలు పలికే భూములను రూ.25 లక్షలకే వస్తుండడంతో ఎలాంటి విచారణ లేకుండానే కొన్ని సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఆ భూములను బ్యాంకుల్లో మార్ట్‌గేజ్‌ చేసి రూ.కోట్లల్లో రుణాలు తీసుకుంటున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఇలా రూ.వేల కోట్లు రుణంగా తీసుకున్నట్లు సమాచారం.

యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో దశాబ్దాల క్రితం లేఅవుట్లు చేసిన భూములను మళ్లీ వ్యవసాయ భూములుగా కొనుగోలు చేసిన వారి జాబితాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి అనుచరులు ఉన్నారని తెలిసింది. కొందరు ప్రజాప్రతినిధులు 10 నుంచి 20 ఎకరాల వరకు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వాటి చుట్టూ బౌండరీలు ఏర్పాటైనట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed