వివాదంలో మానకొండూరు పోలీస్‌‌ స్టేషన్.. సీఐ కృష్ణారెడ్డి క్లారిటీ

by Sridhar Babu |
వివాదంలో మానకొండూరు పోలీస్‌‌ స్టేషన్.. సీఐ కృష్ణారెడ్డి క్లారిటీ
X

దిశ, మానకొండూరు : మానకొండూర్ మండలంలోని వెల్ది గ్రామంలో ఈ నెల 7న జరిగిన భూ తగాదాలో మానకొండూర్ పోలీసులపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మానకొండూరు సీఐ వై. కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వెల్ది గ్రామంలో భూ విషయమై గొడవ జరుగుతున్నదని తెలియగానే అక్కడకు వెళ్లి విచారణ జరిపామని సీఐ అన్నారు. గ్రామంలోని 103 సర్వే నెంబర్‌లో ఎనగంటి పోచయ్య మొదటి భార్య కుమారులు ఎనగంటి ప్రభాకర్, ఎనగంటి ప్రవీణ్, ఎనగంటి శ్రీనివాస్, ఎనగంటి విజయ భాస్కర్‌కు 8 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో వాటా కోసం ఎనగంటి పోచయ్య మూడో భార్య ఏనగంటి శంకరమ్మ, ఆమె కుమారుడు ఎనగంటి శ్రీకాంత్ గతంలో కోర్టును ఆశ్రయించారు. భూమి వివాదం కోర్టులో ఉండగానే పోచయ్య మొదటి భార్య కుమారులు భూమిని దున్నుతున్నారు.

దీంతో మూడో భార్య శంకరమ్మ, ఆమె కుమారుడు అడ్డం వెళ్లగా శ్రీకాంత్‌ను నెట్టివేశారు. పోచయ్య మొదటి భార్య కుమారులు భూమిని దున్నకుండా అడ్డుకోవాలని మమ్మల్ని కోరగా.. కోర్టు ఉత్తర్వులు లేకుండా భూమిని దున్నకుండా ఆపడం కుదరదని చెప్పామన్నారు. పోచయ్య మొడటి భార్య కుమారుడు ఎనగంటి విజయభాస్కర్ ఫిర్యాదు మేరకు శంకరమ్మతో పాటు ఆమె కుమారుడు శ్రీకాంత్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. శంకరమ్మ, ఆమె కుమారుడు శ్రీకాంత్‌కు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయాలని చెప్పామని సీఐ తెలిపారు. వారిపై కేసు నమోదు అయిందని తెలుసుకున్న శంకరమ్మ, ఆమె కుమారుడు శ్రీకాంత్ జీర్ణించుకోక పోలీసులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వకుండా పై అధికారులకు ఫిర్యాదు చేశారని సీఐ వివరించారు. మానకొండూర్ పోలీసులపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని, పోలీసు స్టేషన్‌లో ప్రతీ ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శంకరమ్మ, శ్రీకాంత్ ఫిర్యాదు చేసేందుకు వస్తే తాము తిరస్కరించామనడం పూర్తిగా అవాస్తవమని, పోలీసులను ఇబ్బంది పెట్టాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story