పార్టీలో లేనివారికి ప్రభుత్వ భూమి రాదు.. మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

by Sumithra |
పార్టీలో లేనివారికి ప్రభుత్వ భూమి రాదు.. మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, నాగర్‌కర్నూల్: నీవు మా పార్టీ కాదు.. నీకు ప్రభుత్వం నుంచి పట్టా భూమి ఇచ్చేది లేదు.. అక్కడ ఇల్లు కట్టుకునేందుకు వీలు లేదు అంటూ ఓ గ్రామపంచాయతీ సర్పంచ్.. సెక్రటరీ ద్వారా నోటీసు ఇచ్చాడు. దీంతో సదరు వ్యక్తి మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గౌతమ్‌పల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బాధితుడి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం..

గౌతమ్‌పల్లి గ్రామానికి చెందిన కావాలి వెంకటయ్యకు 1990లో సర్వే నెంబర్ 2లో 175 గజాల స్థలాన్ని గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇల్లు కట్టుకునేందుకు గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి కాసిం అనుమతి కోసం వెళ్తే.. మా పార్టీ వ్యక్తివి కాదు.. నీకు ప్రభుత్వ జాగా ఎట్లా ఇస్తాం.. అక్కడ ఇల్లు కట్టేందుకు అనుమతి లేదంటూ పంచాయతీ కార్యదర్శి కాసీం నోటీసులు ఇచ్చారు. దీనిపై గ్రామ సందర్శనకు వచ్చిన అదనపు కలెక్టర్ మనూచౌదరికి మొరపెట్టుకున్నాడు బాధితుడు.

ఈ నేపథ్యంలోనే తమపైనే ఫిర్యాదు చేస్తావా.. ఇల్లు ఎలా కడతావో చూస్తాం అంటూ బెదిరించారు సర్పంచ్. వారి బెదిరింపులకు తీవ్ర మనస్థాపం చెందిన వెంకటయ్య సోమవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినప్పటికీ… పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వెంకటయ్య చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మృతదేహం ఉన్న అంబులెన్స్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉంచి ధర్నా నిర్వహించారు. వెంటనే గ్రామ సర్పంచ్, కార్యదర్శిని తొలగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story