రాష్ట్రమొక్కటే… లెక్కలే వేరు !

by Shyam |   ( Updated:2020-04-28 23:32:27.0  )
రాష్ట్రమొక్కటే… లెక్కలే వేరు !
X

రోజుకోరకంగా బులెటిన్ వివరాలు

రాష్ట్రానికీ కేంద్రానికీ కుదరని పొంతన

దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల లెక్కలపై రోజుకో గందరగోళం చోటుచేసుకుంటోంది. రాష్ట్రం ఒక్కటే అయినా కరోనా పేషెంట్ల లెక్కల విషయంలో మాత్రం తేడాలు ఉంటున్నాయి. రాష్ట్ర లెక్కలకు, కేంద్ర లెక్కలకు పోలికే ఉండట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే బులెటిన్లలోనూ ఒకదానికొకటి పొంతన ఉండటంలేదు. వరుసగా రెండు రోజుల బులెటిన్లను పోల్చి చూస్తే ఏది వాస్తవమో, ఏది తప్పో అర్థంకాని పరిస్థితి. ఇక అధికారుల సమన్వయం కోసం ప్రభుత్వ అంతర్గత వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే లెక్కలు సైతం ఇందుకు భిన్నంగానే ఉంటున్నాయి. కరోనా కోసమే తెరిచిన రాష్ట్ర వెబ్‌సైట్ లెక్కలు ఒకరకమైతే.. రాష్ట్రాల వివరాలతో ‌అప్‌డేట్ చేసే కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ లెక్కలు మరో రకం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వెబ్‌సైట్‌ (మైగవ్ డాట్ ఇన్)లోని లెక్కలైతే వీటన్నింటికీ భిన్నం. ఇందులో ఏ లెక్కలు కరెక్టో ప్రభుత్వాలకే ఎరుక. వాస్తవాలు మాత్రం అంతుచిక్కడం లేదు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య, మృతులు, డిశ్చార్జి అయినవారు, యాక్టివ్ పాజిటివ్ కేసులతో పాటు జిల్లాలవారీగా కేసుల వివరాల్లో తప్పులు దొర్లడం నిత్యకృత్యమైపోయింది.

ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలతోపాటు వాస్తవ లెక్కలు కూడా చాలా అవసరం. అందుకే ప్రతిరోజూ బులెటిన్లను విడుదల చేయాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఈ లెక్కలను చూస్తే వాస్తవం సంగతేమోగానీ చాలా అనుమానాలు తెరపైకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయినవారు 26 మంది. కానీ రాష్ట్ర లెక్కల ప్రకారం 25 మందే. ఆ ఒక్కరు ఎవరో తెలియదు. డిశ్చార్జి అయినవారి లెక్కల విషయంలోనూ ఇదే గందరగోళం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే బులెటిన్ ప్రకారం ఏప్రిల్ 27 రాత్రి 8.00 గంటల సమయానికి డిశ్చార్జి అయినవారు 332 మంది. కానీ, కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం అది 321 మాత్రమే. ఇక కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారమైతే అది కేవలం 280 మాత్రమే. వేర్వేరు శాఖలు వెలువరిస్తున్న ఈ గణాంకాల మధ్య గంటల తేడా ఉండొచ్చుగానీ లెక్కలు ఒకదానికి మరొకటి పొంతన లేకుండా ఉండటమే చర్చనీయాంశం. ఇప్పటికీ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ)లో కరోనా పాజిటివ్ కేసులెన్నన్న విషయం గందరగోళమే.

రాష్ట్ర లెక్కలంతా అయోమయం..

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ పేరుతో ప్రతీరోజు బులెటిన్లు విడుదలవుతున్నాయి. గతంలో అంకెల్లో గందరగోళం ఉండటంతో ఒకే రోజున మూడు మార్పులు చేసి అర్ధరాత్రి దాటిన తర్వాత చివరి బులెటిన్ విడుదలైంది. రెండు రోజుల కిందట కూడా ఇలాంటి తప్పు రావడంతో సవరణ పేరుతో మరో బులెటిన్ విడుదలైంది. కానీ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో మాత్రం నాలుగైదు తప్పులున్నాయి. ఆదివారం (ఏప్రిల్26) విడుదల చేసిన బులెటిన్‌లో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 540, డిశ్చార్జి అయినవారు 151, యాక్టివ్ కేసులు 317 అని డైరెక్టర్ పేర్కొన్నారు. కానీ మరుసటి రోజు విడుదల చేసిన బులెటిన్‌లో రెండు కేసులు కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 556, డిశ్చార్జి అయినవారు 138, యాక్టివ్ కేసులు 400 అని పేర్కొన్నారు. చనిపోయినా, డిశ్చార్జి అయినా మొత్తం కేసుల సంఖ్యలో ఎలాంటి మార్పూ ఉండదు. కానీ బులెటిన్‌లో మాత్రం ఏకంగా 16 తేడా ఉంది. ఒక్క రోజులో ఇద్దరే కొత్తగా పాజిటివ్ పేషెంట్లు అయితే 16 మంది ఎలా పెరిగినట్లు? ఆదివారం నాటికే 151 మంది డిశ్చార్జి అయితే సోమవారం ఆ సంఖ్య 131కు ఎలా తగ్గిపోయింది? వీటికి ఎక్కడా ప్రభుత్వం నుంచి సమాధానం ఉండదు. కేంద్ర వెబ్‌సైట్ తాజా గణాంకాల ప్రకారం హైదరాబాద్ (జీహెచ్ఎంసీ)లో మొత్తం పాజిటివ్ కేసులు 472 మాత్రమే.

బులెటిన్లలో గందరగోళం ఇలా ఉంటే అధికారుల మధ్య సత్వర సమాచారాన్ని పంచుకోవడం కోసం రూపొందించిన అంతర్గత వెబ్‌సైట్‌లో వివరాలు ఇంకో రకంగా ఉంటున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య కేవలం 525 మాత్రమే అని ఉంది. ఇక డిశ్చార్జి అయినవారి సంఖ్య 134. ఏప్రిల్ 28 మధ్యాహ్నం నాటికి కొత్తగా ఒక పాజిటివ్ కేసు రావడంతో.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1008 అని పేర్కొంది. అంటే ముందురోజు రాత్రి నాటికి మొత్తం సంఖ్య 1007. కానీ బులెటిన్ ప్రకారం అది సోమవారంరాత్రి నాటికి 1003 మాత్రమే. అంటే నాలుగు కేసుల వ్యత్యాసం ఉంది. ఇక కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్ కేసులు 1004. కేంద్ర వెబ్‌సైట్ ప్రకారం 1002 మాత్రమే. గద్వాల జిల్లాలో బులెటిన్ ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 45 అయితే అంతర్గత వెబ్‌సైట్ ప్రకారం 48. మూడు కేసులు తేడా. ఇదే జిల్లాలో తొమ్మిది మంది డిశ్చార్జి అయినట్లు బులెటిన్‌లో ఉంటే వెబ్‌సైట్‌లో మాత్రం 11 మంది డిశ్చార్జి అయినట్లు ఉంది. కామారెడ్డి జిల్లాలో బులెటిన్ ప్రకారం మొత్తం కేసులు 12 అయితే వెబ్‌సైట్ ప్రకారం 11 మాత్రమే.

కేంద్ర లెక్కల్లో కరోనా మృతులు 26 మంది..

రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం (బులెటిన్, వెబ్‌సైట్) రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందినవారి సంఖ్య 25. కానీ కేంద్ర వైద్యారోగ్య, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 26 మంది. ఆ ఒక్కరు ఎవరో ఎప్పటికీ తేలదు. కరోనా నివారణకు విస్తృతంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నా ఎప్పటికప్పుడు ఒకే రకమైన సమాచారం ఉండేలా చూసుకోవడంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. సోమవారం రాత్రి నాటికే రాష్ట్రంలో 332 మంది డిశ్చార్జి అయితే మంగళవారం ఉదయానికి కూడా కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల్లో 321 మంది మాత్రమే అనే లెక్క ఉంటుంది. ఇంతకూ రాష్ట్రంలో చనిపోయింది ఎంతమంది అనేది మిస్టరీగానే మిగిలిపోతుంది.

గతంలో ‘కంటివెలుగు’ పథకం లెక్కలు కూడా ఇదే తీరున గందరగోళంగా ఉన్నాయి. ఆ పథకం ఆగిపోయినా లెక్కల్లోని గందరగోళాన్ని మాత్రం వైద్య సిబ్బంది సరిచేసుకోలేకపోయారు. ఇప్పుడు కరోనా లెక్కలు కూడా అలానే ఉన్నాయి. ముందురోజు బులెటిన్‌కు, మరోసటి రోజు బులెటిన్‌కు మధ్య లెక్కల్లో పొంతనలేకపోవడంతో ఇవి సరైన లెక్కలేనా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. కానీ ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి చర్యలు తీసుకోకుండా విమర్శలు చేయడానికే ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారు. తప్పుడు లెక్కలు ఇచ్చినందుకు దిద్దుబాటు చర్యలు తీసుకోడానికి బదులు తప్పులు చూపించినవారిని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. పారదర్శకత లోపించినప్పుడు తప్పులకు సమాధానాలు దొరకడం కష్టం. ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది అదే. అందుకే కేంద్ర లెక్కల్లో సైతం తప్పులు దొర్లుతున్నాయి.

Tags: Telangana, Corona, Statistics, Mistakes, Bulletin, Website, Union Health Ministry

Advertisement

Next Story

Most Viewed