ఆస్ట్రేలియా ఓపెన్‌కి ఎందుకంత క్రేజ్?

by Shiva |
ఆస్ట్రేలియా ఓపెన్‌కి ఎందుకంత క్రేజ్?
X

దిశ, స్పోర్ట్స్: క్రీడల్లో రాణించడం అంటే అంత సులభమైన విషయం కాదు. క్రీడాకారుల్లో ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోదు.. ఆ ప్రతిభను మరింత పదును పెట్టడానికి అవసరమైన సామాగ్రి, కోచింగ్ వంటివి కూడా ఉండాలి. అందుకోసం ఎంతో డబ్బును ఖర్చు చేయాల్సి ఉంది. టెన్నిస్ వంటి ఆటలో శిక్షణ పొందాలంటే వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. డబ్బున్న క్రీడాకారులైతే ఎంతైనా ఖర్చు చేయగలరు. కానీ అంత ఖర్చు భరించలేని వారికి పరిస్థితి ఏంటి? అలాంటి వారు టెన్నిస్ టోర్నీలు ఆడి అక్కడ లభించే ప్రైజ్ మనీతో ఇలాంటి ఖర్చులకు డబ్బులు సంపాదిస్తారు. యువ టెన్నిస్ ప్లేయర్లు అందుకే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఆడటానికి అందుకే ఇష్టపడుతుంటారు. వారికి సరైన స్పాన్సర్లు లేకపోయినా.. పలు టోర్నీలలో ఆడి డబ్బు సంపాదిస్తుంటారు.

ఆస్ట్రేలియా ఓపెన్‌కు క్యూ..

ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు పలు దేశాల నుంచి అనేక మంది టెన్నిస్ ప్లేయర్లు వచ్చారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఆస్ట్రేలియాలో కఠినమైన క్వారంటైన్ నిబంధనలు విధించారు. అయినా సరే ప్రయాణ ఖర్చులు భరించి, క్వారంటైన్‌లో ఉండి ఆస్ట్రేలియా ఓపెన్ ఆడటానికి యువ క్రీడాకారులు క్యూ కట్టారు. దీనికి కారణం ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు ఇచ్చే ప్రైజ్ మనీనే కారణం. యూఎస్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్‌లో లభించే డబ్బు కంటే ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరింత ఎక్కువగా దక్కుతుంది. ఇక్కడ తొలి రౌండ్‌లో ఓడిపోయినా సరే కనీసం 77 వేల డాలర్లు (రూ. 51 లక్షలు) లభిస్తాయి. అందుకే వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఆస్ట్రేలయా ఓపెన్‌ తొలి రౌండ్‌లో ఓడినా ధైర్యంగా ఇంటికి తిరుగుముఖం పడతారు. యూఎస్ ఓపెన్‌లో అయితే తొలి రౌండ్‌లో ఓడితే 65 వేల డాలర్లు, వింబుల్డన్‌లో అయితే 55 వేల డాలర్లు లభిస్తాయి. ఇక గెలుస్తూ ముందుకు వెళ్తే క్రమంగా ప్రైజ్ మనీ పెరుగుతూ ఉంటుంది.

ఓడినా.. అందుకే వస్తున్నా

స్లోవేకియాకు చెందిన తమారా జిదాన్‌సేక్ తమ దేశం నుంచి యూఏఈకి వచ్చింది. అబుధాబిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఫ్లైట్ ఎక్కి మెల్‌బోర్న్ చేరుకుంది. 14 రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉన్న తమారా.. సోమవారం తొలి రౌండ్ మ్యాచ్‌లో ఓడిపోయింది. కజకిస్తాన్‌కు చెందిన జరీనా దియాస్ చేతిలో 6-2, 7-5 తేడాతో వెనదిరిగింది. తొలి రౌండ్లో ఓడిపోవడంతో నిర్వాహకులు ఆమెకు 77 వేల డాలర్ల చెక్ ఇచ్చారు. దీనిపై ఆమె సంతోషంగా స్పందించింది. ‘తన దగ్గర ఎక్కువ డబ్బు లేదు.

కోచింగ్ కోసం అధిక మొత్తం ఖర్చు పెట్టేందుకు కుటుంబం దగ్గర అంత సంపాదన లేదు. అందుకే గ్రాండ్‌స్లామ్స్ ఆడటానికి, ఇతర టెన్నిస్ టోర్నీలు ఆడటానికి వేల కిలోమీటర్లు సొంత ఖర్చుతో ప్రయాణిస్తాను. ఎందుకంటే అక్కడ తొలి రౌండ్‌లో ఓడినా డబ్బు వస్తుంది. అది నా కోచింగ్ కోసం, క్రీడ సామాగ్రి కోసం వెచ్చిస్తాను’ అని చెప్పింది. ఒక్క తమారానే కాదు.. అనేక మంది యువ క్రీడాకారులు తమ ఖర్చులను ఇలా టోర్నీలు ఆడే సంపాదిస్తున్నారు. అందులో ఆస్ట్రేలియా ఓపెన్ అంటే మరింత మంది క్యూ కడతారు.

Advertisement

Next Story

Most Viewed