- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎక్కడి లారీ అక్కడే!
దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే నెల 3వ తేదీ వరకూ పొడిగించడంతో ఇటు లారీల యజమానులు, అటు లారీ డ్రైవర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందే సరుకులతో బయలుదేరిన లారీలు మార్గమధ్యంలోనే చిక్కకుపోయాయి. ఊరుకాని ఊరిలో నిలిచిపోయిన లారీ డ్రైవర్ల దుస్థితి వర్ణనాతీతం. ఇటు ఇంటికి దూరమై, అటు గమ్యానికి చేరుకోలేక సతమతమవుతున్నారు. తిండీతిప్పలు దొరకక అవస్థలు పడుతున్నారు. సరుకు లోడుతో ఉన్న లారీలను వదిలిపెట్టలేక, ఇంటికి చేరుకోడానికి మార్గం లేక నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. రవాణా వ్యవస్థ స్థంభించిపోవడంతో లారీ ట్రాన్స్‌పోర్టు రంగంపై ఆధారపడిన డ్రైవర్లు, క్లీనర్లు ఉపాధి కోల్పోయారు. పరోక్షంగా ఆధారపడిన అనేక లక్షల కుటుంబాలు పనికోల్పోయాయి.
రాష్ట్రంలో ప్రైయివేట్ ట్రాన్స్‌పోర్టు లారీలు సుమారు 1.75 లక్షల వరకు ఉన్నాయి. ఈ వ్యవస్థపై ఆధారపడి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సుమారు 10 లక్షల మంది బతుకుతున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి నేషనల్ పర్మిట్ ఉన్న లారీలు వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయని, లాక్‌డౌన్ కారణంగా సరుకులు లోడ్ చేసుకుని వెళ్ళిన లారీలు సుమారు 20 శాతం మార్గమధ్యలో నిలిచిపోయాయని రాష్ట్ర లారీ అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలకు వాహనాలు సరుకులతో ఇక్కడికి వచ్చి లాక్‌డౌన్ వల్ల చిక్కుకుపోయాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి, తమిళనాడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ట్విట్టర్ ద్వారా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు పరిస్థితిని వివరించి లారీలు స్వంత రాష్ట్రాలకు వెళ్ళేలా ప్రత్యేక అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మార్గమధ్యలోనే నిలిచిపోయిన లారీల దగ్గరే ఉంటున్న డ్రైవర్లకు నిలువ నీడ లేకుండాపోయింది. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి దొరకడంలేదు. సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు వీరు అపరిచితులు కావడంతో ఊర్లలోకి రానివ్వడంలేదు. దీంతో చెక్‌పోస్టు, టోల్‌గేట్ల దగ్గర ఉండి దాతలు ఇచ్చే ఫుడ్ ప్యాకెట్లతో కాలం వెళ్ళదీస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఉత్పత్తి రంగం కుప్పకూలడంతో వస్తువుల తయారీ, లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా స్తంభించిపోయింది. అత్యవసరమైన సరుకులు మినహా మిగిలిన లారీలన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికే హోల్‌సేల్ మార్కెట్లకు చేరుకున్న లారీల్లోని సరుకును అన్‌లోడింగ్ చేయడానికి కూడా హమాలీల కొరత ఏర్పడింది. కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు ఫైనాన్స్‌మీద లారీలను కొన్న యజమానులు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి : భాస్కర్‌రెడ్డి, తెలంగాణ లారీ అసోసియేషన్ అధ్యక్షులు
“లాక్‌డౌన్‌తో లారీ యజమానులకు చిక్కులొచ్చి పడ్డాయి. ఎక్కడి లారీలు అక్కడ నిలిచిపోయాయి. మూడు వారాల నుంచి సరుకు రవాణా లేదు. ఆదాయం పడిపోయింది. చాలా లారీలు ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయాయి. అవి వచ్చే మార్గం లేదు. డ్రైవర్లు అక్కడే ఉండిపోయారు. వారి ఖర్చులకు డబ్బులు పంపాల్సి ఉంటుంది. ఫైనాన్స్ ద్వారా కొన్న లారీలకు ప్రతీ నెలా ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ కాలంలో లారీల నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌ల చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల మినహాయింపు ఇచ్చింది. కానీ వడ్డీకి మాత్రం అలాంటి మినహాయింపు ఇవ్వలేదు. లారీలే తిరగకుంటే ఇక మూడు నెలల కాలానికి వడ్డీ ఎట్లా కడతాం? రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్డు టాక్స్, ఫిట్‌నెస్, నేషనల్ పర్మిట్ తదితరాల్లో మూడు నెలల పాటు మినహాయింపు ఇవ్వాలి. లారీ యజమానుల్లో ఎక్కువ శాతం మంది అప్పులు చేసి లేదా ఫైనాన్స్ ద్వారా కొనుక్కున్నవారే. లాక్‌డౌన్ ఉన్నంత కాలం ఇన్సూరెన్స్ కాలపరిమితిని కూడా పొడిగించాలి. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే క్వార్టర్లీ పర్మిట్‌కు కూడా మినహాయింపు ఇవ్వాలి”
రోడ్డు మీద ఉండలేను.. ఇంటికి వెళ్ళలేను : మహేందర్,లారీ డ్రైవర్
“నేను జనతా కర్ఫ్యూకు ముందే హైదరాబాద్ నుంచి వేస్ట్ పేపర్ లోడు తీసుకుని శ్రీకాకుళం బయలుదేరాను. ఏలూరు చెక్‌పోస్టు దగ్గరకు వచ్చేసరికి ఆపివేశారు. లాక్‌డౌన్ అని చెప్పారు. లారీని వదిలి పోలేను. ఇంటికి వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ ఉండలేను. తిందామంటే తిండి దొరుకుతలేదు. గుక్కెడు నీళ్లకు కూడా కరువైంది. చెక్‌పోస్టు దగ్గర ఎవరో దాతలు వచ్చి అన్నం పెడుతున్నారు. దొరికినప్పుడు తిని కాలం గడుపుతున్నా. ఇప్పటికి దాదాపు మూడు వారాలైంది. వచ్చే నెల దాకా లాక్‌డౌన్ అని అంటున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వమేమో సరుకు రవాణా లారీలకు మినహాయింపు ఉందంటోంది. కానీ నా లారీలో వేస్ట్ పేపర్ లోడ్ ఉండడంతో ఇది నిత్యావసర వస్తువుల పరిధిలోకి రాదంటూ వెళ్ళడానికి చెక్‌పోస్టు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఎన్నిరోజులుండాలో అర్థం కావాడం లేదు. ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్ చేసుకోడానికి కూడా వీలుకావడంలేదు”
Tags: Transport lorry, driver, LockDown, Telangana, Goods, National Permit