ఎంపీ రఘురామ నోటీసుపై స్పందించిన లోక్‌సభ సెక్రటేరియట్

by srinivas |   ( Updated:2021-06-18 04:36:18.0  )
ragurama krishnamraju news
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం వైఎస్ జగన్, డీజీపీతోపాటు ఇతర పోలీస్ అధికారులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై లోక్‌సభ సెక్రటేరియట్ స్పందించారు. ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలు అందజేయాలని హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాను ఆదేశించారు. రఘురామ ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన లేఖపై పూర్తి వివరాలు అందజేయాలన్నారు. అలాగే రఘురామను కస్టోడియల్ టార్చర్‌కు గురి చేయడంపై ఆయన కుమారుడు భరత్, టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ల లేఖలోని అంశాలపైన వివరాలు ఇవ్వాలని హోంశాఖను లోక్‌సభ సెక్రటేరియట్ కోరారు.

15 రోజుల్లోగా సమగ్ర నివేదికను హిందీ, ఇంగ్లీష్ కాపీలలో తమకు అందజేయాలని లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశించారు. ఇకపోతే జూన్ 1న తనను అక్రమంగా అరెస్టు చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. తన సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీఎం జగన్, డీజీపీ, సీఐడీ ఏడీజీ, గుంటూరు అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్‌పై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story