- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
- Union Budget 2025-2026
అసంపూర్ణంలో ఆనందం
జీవితం సంక్లిష్టమైనదని కొందరి భావన. దానిని సరళతరం చేయడానికి ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు, గ్రంధాలు, తత్వాలు, బోధలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి నచ్చిన మార్గాన్ని వారు ఎంచుకున్నప్పటికీ అంతిమంగా ఆనందం వైపు ప్రయాణించడమే సమిష్టి మానవ జీవిత లక్ష్యం. కష్టతరమైన జీవన మార్గాన్ని ఆనందం వైపు తీసుకువెళ్లే తాత్విక బోధల్లో బౌద్ధం ప్రధానమైనది. అశాశ్వతమైన దానిని శాశ్వతంగా ఉండాలని కోరుకోవడమే దుఃఖానికి మూలమని బుద్ధుడు బోధిస్తాడు. ప్రతిదీ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందనీ, మార్పు అనివార్యమని విశ్వసించిన నాడు దుఃఖ రహిత మనఃస్థితి సాధ్యమని బౌద్ధ మత ప్రధాన బోధ. అందుకే బుద్ధుడు "నేను ఎప్పుడూ ఆరంభాన్నే" అంటాడు. బుద్ధుడి బోధన గ్రహించినప్పుడు ఈ ప్రపంచంలో పరిపూర్ణమైనది ఏదీ లేదని అర్థమవుతుంది. వాబి సాబి తాత్విక ధోరణికి ఇదే పునాది. బౌద్ధం నుంచి రూపుదిద్దుకున్న వాబి సాబి భావన అర్థం చేసుకుంటే జీవితం సంక్లిష్టం నుంచి సరళంగా మారుతుంది. అంతా ప్రవహించే ధారలాగా ఉన్నప్పుడు మనం ఎదురీదితే కష్టపడతాం. దాని దిశను అనుసరించడమే ఆనందమైన మార్గమని వాబి సాబి చెబుతుంది. నిన్నటి లాగానే రేపు ఉండనప్పుడు వర్తమానాన్ని గురించి భవిష్యత్తు గురించి విచారం ఎందుకని వాబి సాబి బోధిస్తుంది.
జ్ఞానాన్ని పంచే పుస్తకం
ప్రఖ్యాత జపాన్ రచయిత నోబువా సుజుకీ రచించిన పుస్తకం వాబి సాబి. జపనీయుల తత్వశాస్త్రాన్ని, మానసిక శాస్త్రాన్ని మిళితం చేసి రచనలు చేయడం నోబువా సుజుకీ ప్రత్యేకత. ఇదే బాటలో వాబి సాబి రచన కొనసాగింది. వాబి సాబి 166 పేజీల చిన్న పుస్తకం. అయినప్పటికీ ఎంతో విలువైన భావనలు ఈ పుస్తకంలో లభిస్తాయి. మన జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేయగల శక్తి కొన్ని పదాల్లో ఉండవచ్చని ప్రసిద్ధ తత్వవేత్త హెన్రీ డేవిడ్ థోరొ అన్నట్లు వాబి సాబి పుస్తకంలో విలువైన పదాలతో పాటు జీవితాన్ని మార్చివేయగల శక్తివంతమైన సిద్ధాంతం నిక్షిప్తమై ఉంటుంది. రచయిత వివరించే వాబి సాబి జీవన విధానంతో పాటు పుస్తకంలోని చిన్న చిన్న కవితలు, హైకూలు, చిత్రాలు ఆకట్టుకుంటాయి. జపనీస్‌తో పాటు ఇతర భాషల్లోకి అనువాదం పొందిన వాబి సాబి పుస్తకాన్ని సరళమైన పదాలతో వేదాంతం వేంకట సత్యవతి తెలుగు అనువాదం చేశారు. పాఠకులు సులభంగా అర్థం చేసుకునేందుకు రచయిత ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో తత్వశాస్త్రంగా వాబి సాబిని ఎలా అర్థం చేసుకోవచ్చో చెప్పారు. రెండో భాగంలో ప్రాచీన జపాన్ సంస్కృతిలో వాబి సాబి సృజనాత్మక కళను పరిచయం చేశారు. మూడో భాగంలో వాబి సాబి తాత్విక ధోరణితో జీవన విధానాన్ని వివరించారు.
వాబి సాబి జీవన విధానం..
ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటానికి ఆ వ్యక్తి పూర్తిగా పిచ్చివాడై ఉండాలి అంటారు ఫ్రెంచ్ నవలా రచయిత గుస్తావ్ ఫ్లబే. ఆనంద విషాదాలు జీవితాన్ని సమపాళ్లలో పంచుకుంటాయి. సంతోషాన్ని హత్తుకున్నట్లు గానే విచారాన్ని దగ్గరకు తీసుకోవడం చాలా కష్టం. కానీ, సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాలంటే ఆనందాన్ని విషాదాన్ని రెండిటిని సమానంగా కౌగిలించుకో కలగాలి. ' సుఖదుఃఖాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి, ఒకటి మీ సహపంక్తిని భోజనానికి కూర్చుంటే, రెండవది మీ శయ్యపై నిద్రిస్తూ ఉంటుందని మరిచిపోకండి ' అంటారు ఖలీల్ జీబ్రాన్. వాబి సాబి ఇదే విధమైన తాత్వికతను బోధిస్తుంది. అందమైన టీ కప్పు ఎంతగా ఆకర్షిస్తుందో పగిలిన టీ కప్పు సౌందర్యాన్ని కూడా ఆస్వాదించగలిగే మనసు కలిగి ఉండాలి. వికసించే పువ్వును చూసి పరవశించినట్లే, వాడిన ఆకులోని కళాత్మకతను చూసి అబ్బురపడాలి. వసంతాన్ని శిశిరాన్ని సమంగా ప్రేమించాలి. ఏది స్థిరంగా ఉండదు. పరిస్థితులన్నీ నిరంతరం మార్పు చెందుతూనే ఉంటాయి.
ఆధునికంగా జీవించడమంటే..
ఈ క్షణం మళ్లీ తిరిగి రాదని గ్రహించినప్పుడు జీవితాన్ని ప్రేమించడం ప్రారంభిస్తాం. యుక్త వయసులో పెదాలపై విరిసే చిరునవ్వుకు అత్యున్నత శిఖరమే వృద్దాప్యంలో ముఖంపై మడతలని వాబిసాబి చెబుతుంది. చూసే దృష్టిని బట్టి రెండిటిలోనూ అందం ఉంటుందని వాబిసాబి తత్వశాస్త్రం బోధిస్తుంది. వాబి అంటే ప్రశాంతత, నిరాడంబరత్వం అని అర్థం. సాబి అంటే వయస్సు, అనుభవం తెచ్చిన అందం అని అర్థాలు. జెన్, బుద్ధిజం బోధనలతో ఈ రెండు పదాలను కలిపి వాబి సాబి తత్వశాస్త్రాన్ని అభివృద్ధి పరిచారు జపనీయులు. జీవితంలోనూ, విజ్ఞాన శాస్త్రంలోనూ యత్నం, దోషం రెండిటి వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని రచయిత నోబువా సుజుకీ చెబుతారు. అందుకే, ప్రతి లోపం అదే సమయంలో మంచి లక్షణంగా మారుతుందని అంటారు. ఆధునిక జీవన విధానానికి తగ్గట్టు ఈ పుస్తకంలో పాఠకుల కోసం రచయిత కొన్ని సూచనలు, సలహాలు ఇస్తారు. వయసుతో సంబంధం లేకుండా మార్పును ఆశించేవారు ఇవి ఆచరించదగినవి. ఆధునికంగా జీవించడం అంటే నిరాడంబరంగా జీవించటమేనని రచయిత భావన.
పుస్తకం : వాబి సాబి
రచయిత : నోబువా సుజుకీ
తెలుగు అనువాదం : వేదాంతం వేంకట సత్యవతి
పేజీలు : 166. వెల : రూ.399
ప్రతులకు : ఆన్ లైన్ స్టోర్స్‌లో లభ్యం
సమీక్షకులు
- శిఖా సునీల్ కుమార్
99081 93534