చితికిన చందమామలు

by Ravi |   ( Updated:2025-01-27 00:00:26.0  )
చితికిన చందమామలు
X

వాళ్ళెవరో ఏమిటో

మనకేమీ తెలువకపోవొచ్చు

మన మాటల్లో, నడకల్లో

నలుగురు కూచొని నవ్వే వేళల్లో

మన దరిదాపులకు కూడా రాకపోవొచ్చు

ఒక్క విరిగిన వాక్యంగానైనా

పనికిరాక పోవొచ్చు

చితికిన చందమామల్ని

పాలిథిన్ కవర్లలో చుట్టి

శవాలకింద లెక్కేసుకోవడానికి

తప్ప పేపర్లలో ఒక

చిన్న వార్తగానైనా రాకపోవొచ్చు

వాళ్ళు కలలేమిటో, కన్న వాళ్ళెవరో

చరిత్రలో రికార్డు గాకపోవొచ్చు

అన్నా.. ఒక్కసారి భూమి నడగండి

త్యాగాల చరిత్ర చెబుతుంది

బుల్లెట్‌లతో జల్లెడైన చెట్టు నడగండి

విత్తనాల పండుగ నాడు నేలకొరిగిన

చదువుల తల్లి గూర్చి చెబుతుంది

రక్తమెండిన వాకిలి నడగండి

పాలు తాగుతూ తాగుతూ

రొమ్ము మీదనే విగతజీవిగా వాలిన

పసిగుడ్డు గురించి చెబుతుంది

కాలిన గూడేలమీద

కమిలిన వెన్నెల నడగండి

కార్పోరేట్‌లకు బలైపోయిన

లక్షలాది ఆదివాసీ

వెతల గూర్చి చెబుతుంది

అడవి మాదన్నందుకు

కొండల్ని గుట్టల్ని

దేవతలుగా పూజించి నందుకు

ప్రకృతి ఒడిలో ధవళ పుష్పమై

వికసించినందుకు ఆదివాసీలు

ఎన్ని బాయొనెట్ మొనల కుదేహాలనిచ్చారో

శవాలమోసిన ఇంద్రావతి నడగండి.

మనమిక్కడ...

భద్రతా వలయాలమధ్య

జీవితాలు కుంచింపజేసుకుంటుంటే

వాళ్ళక్కడ...

నూతన మానవావిష్కరణకోసం

రక్త తర్పణంగావిస్తో

హద్దుల్ని చెరిపేసి

సరికొత్త ప్రపంచం కోసం పాదులు వేస్తున్నారు..

ఇప్పటికి

శవాలే కావొచ్చు

రేపటి సూర్యులు వాళ్ళు..

(అడవి కోసం అమరులౌతున్న ఆదివాసీలకు)

ఉదయ మిత్ర

89196 50545

Advertisement

Next Story