- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకులు కోడండ్లు-తల్లిదండ్రులు
ప్రపంచీకరణ ప్రభావంతో శాస్త్రసాంకేతిక సాఫ్ట్‌వేర్ రంగం కొత్త పుంతలు తొక్కింది. మధ్య తరగతి జీవులు సంపన్నవర్గంలో చేరిపోయారు. ఇంజనీరింగ్ చదివినవారికి ఉద్యోగావకాశాలు, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ రంగాలలో విప్లవాత్మక అవకాశాలు గత ఇరవై ఏళ్లకు పైగా విస్తృతం అయ్యాయి. విదేశాలలో వాళ్లకు అగ్గువకు మనవాళ్లు దొరకడం, ఆ వేతనం ఇక్కడ పదింతలు కావడం, కార్లు, విల్లాలు విపరీతంగా అమ్ముడుపోవడం ఒక గొప్ప అవకాశమే. కులవృత్తులు విధ్వంసం కావలసిందే, కులంతోపాటు తెలియని లొంగుబాటును కాలదన్ని ఉన్నత శ్రేణులకు వెళ్లడం. అయితే ఎక్కడకు పోయినా కులం ఏర్పడకుండా వెంట ఉండే ఉంటుంది. అది వేరే సంగతి. ఇంజనీరింగ్ చదివిన అందరికీ ఇది వర్తించక పోవచ్చు కానీ, గ్రామాలు, నగరాలలో నయా సంపన్నవర్గం నడుస్తుంది. అయితే, చిక్కు ఎక్కడ వచ్చిందంటే, కుటుంబంలోనే.
చేదు నిజాలు
మొన్న వాకింగ్ లో పరిచయమైన నడక మిత్రుడు 'మనకు ఏం కాకుండా మన ఆరోగ్యం కాపాడుకోవాలె. ఏమన్న అయితే కొడుకులు రారు, కోడండ్లు చేయరు' అని ఖరాకండిగా చెప్పిండు. 'నా కొడుకులను మంచిగ ఎదగాలనే మంచిగా చదివించిన, ఇంజనీరింగ్ అయ్యింది. మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. మరో సాఫ్ట్‌వేర్ అమ్మాయి కోడలుగా వచ్చింది. ఇద్దరివీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు, అపార్ట్‌మెంట్ నివాసాలు. మమ్మల్ని రమ్మంటరు. మేము ఎక్కువ రోజులు ఉండలేము. పోలేము. వాళ్లను ఇక్కడికి రమ్మంటే రారు. వచ్చినా మళ్లీ వెళ్లుడు. ఈ స్థితిలో నాకేమైనా అయితే ఎవలు సూసుడు, చేసుడు. కనీసం నొసలుకు అమృతాంజనం రాసే చెయ్యి కరువైంది. ఇంకో కొడుకూ కోడలూ అంతే. వాళ్ల వృత్తులు అట్లాంటివి' అన్నడు.అమెరికాలో ఉండేవాళ్ల స్థితి కూడా దాదాపు ఇదే పద్ధతి.
ఇందులో ఎవరినీ తప్పు పట్టే స్థితి లేదు. ఆధునిక వ్యాపార సాంకేతిక కంప్యూటర్ రంగం తెచ్చిన పెను మార్పులు ఇవి. ఇదే గతంలోనైతే తండ్రి చేసిన వృత్తినే కొడుకు చేస్తుండేవాడు. ఇంట్లనే ఉండటం వలన కొడుకు, కోడలు, మనుమలు, మనుమరాళ్లు కల్సి ఉండే అనుభూతి వేరు ఉండే. 60,70,80 దశకాలలో టీచర్లు, పోలీసులు, కండక్టర్లు, డ్రైవర్లు, సింగరేణి కంపెనీ, రైల్వే ఉద్యోగులు చిన్న చిన్న పరిశ్రమలలో లేదా స్టేట్ గవర్నమెంట్‌లో పని చేసేవాళ్లు ఉండేది. వీళ్లంతా ఒకే ఊర్లో ఉండటం వల్ల తరచు కుటుంబాలు ఒక్కటిగానే ఉండేది. ఎప్పుడైతే సాఫ్ట్‌వేర్ రంగం విప్లవాత్మకమైందో అప్పుడో కుటుంబ సంబంధాలు పూర్తిగా పలుచన అయిపోతున్నాయి. బెంగళురు, హైదరాబాద్, పుణేలాంటి చోట పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వేతనాలు కూడా లక్షలపై చిలుకు దాటిపోయాయి. అక్కడి మిగులు సంపద ఇటువైపు చేరింది.
అందరిదీ అదే బాధ
చాలామంది తల్లిదండ్రులలో 'ఇదంతా పరిణామక్రమంలో జరిగిందే' అనుకోవడం.. లేదా 'ఇది తప్ప వేరే సాధ్యం కాదు, వృద్ధులు ఇక్కడే కొడుకుల కుటుంబాలు అక్కడే' అని స్థిరచింతనలో ఉండాల్సిందే. మనిషి వాడుతున్న గాడ్జెట్స్ అప్‌డేట్ చేసుకున్నట్లు మనస్తత్వం కూడా అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది వరకు పోస్ట్‌కార్డు రాసేది. ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నాం. ఇదివరకు ల్యాండ్ ఫోన్ వాడేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌కు అప్‌డేట్ అయిపోయినం. అట్లాగే తండ్రులూ, తల్లులూ మార్పు దిశగా ఆలోచించాల్సింది. చెంతన ఎవరూ లేరు వాస్తవమే. పలకరించడం లేదు వాస్తవమే.
కానీ ఇదొక అనివార్యత. అక్కడ పిల్లలు, వాళ్లకు పిల్లలు, స్కూల్ ఫీజులు లక్షలకు లక్షలు, కార్లు, ఇండ్లకు ఈఎంఐ కట్టడాలు. కావున మానసికంగా దృఢంగా ఉండడం. అన్ని ఊర్లో స్నేహితులను సంపాదించుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, బంధువులు అంతా గట్లనే ఉంటరు. అదొక కథ. కొడుకులు-కోడండ్ల దృష్టి నుంచి చూస్తే మరోక వ్యథ. ఇద్దరు రోజుకు పన్నెండు గంటలకు పైగా కంప్యూటర్‌లోనే కండ్లు పెడతరు ఎప్పుడు మీటింగ్‌లు టార్గెట్‌లు, లక్ష్యాలు, టెన్షన్ జీవితమే. డబ్బులు బాగా వస్తాయి కానీ, వాటి ఖర్చు చేసే సమయం ఉండదు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇట్లనే ఉన్నది. ఇందుకు పిల్లలను సరిగా చూడనివాళ్లు కూడా ఉంటారు అదంతా పెంపకం లోపం. స్వార్థంతో జీవించడం నేర్పిన తనమే కావచ్చు కానీ ఒక నయా సంపన్న శ్రేణి వెనుక దాగున్న కన్నీళ్ల కథ.
మౌనంగానే పల్లెలు
ఇప్పుడు ఊర్లల్లో ఎవరూ ఉండటం లేదు వృద్ధులైన తల్లిదండ్రులు తప్ప. ఎవరిని చూసినా నగరాలకు వలసపోయిన కుటుంబాల పిల్లల చదువులు ఉపాధి కోసం మండలం జిల్లా హెడ్ క్వార్టర్ లేదా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఊర్లల్లో మిగిలినవారు ప్రజాప్రతినిధులైన కొందరు వ్యవసాయం వృత్తిగా, జీవించేవాళ్ళ ఇంకా కుల వృత్తులు తప్ప ఇంకేం చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళు తప్పుడు భూములు అమ్ముడొ కొనుడు మధ్య దళారి పని చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు. గతానికి ఇప్పటికీ కుటుంబ సంబంధాల్లో వచ్చిన మానసిక సంబంధ మార్పులన్నీ అవగాహన చేసుకొని ఆధునిక దృక్పథుల తో ఆనందంగా జీవితాంతం ఎట్లా అని ఆలోచించవలసిన అవసరం ఉన్నది.
అన్నవరం దేవేందర్
94407 63479