ఆడవాళ్ల ముచ్చట్లు అంటే ఎందుకంత క్యూరియాసిటీ.. మీరు కూడా అలా ఆలోచిస్తున్నారా..?

by Bhoopathi Nagaiah |
ఆడవాళ్ల ముచ్చట్లు అంటే ఎందుకంత క్యూరియాసిటీ.. మీరు కూడా అలా ఆలోచిస్తున్నారా..?
X

ఎప్పుడూ చూడని కండ్లు..

'ఆమె'ను గొప్పగా చూశాయి.

'ఉమెన్' ఊసే ఎత్తని వాళ్లు..

స్త్రీ గొప్పదనం స్టేటస్‌లతో ఉప్పెన సృష్టించారు.

స్త్రీ లేకపోతే జననం లేదన్నారు.. గమనం లేదన్నారు.

స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదన్నారు.. అసలు సృష్టే లేదన్నారు.

ఉమెన్స్ డే అయిపాయె...

ఇగ.. మళ్లీ ఇప్పుడు అవే కూతలు.. మోతలు.!

ఆమె అట్లనంటా.. ఈమె ఇట్లనంటా.. ఆమేం చేస్తదీ.. ఎక్కడ పోతదీ.. ఇవే రాతలు.!

మా బతుకేదో మమ్మల్ని బతకనీయండయ్యా అని మొత్తుకున్నా వినరుగా.?

సొసైటీలో మహిళను ట్రీట్ చేస్తున్న తీరుపై ప్రత్యేక కథనం.!!

- దిశ, ఫీచర్స్

స్త్రీ గొప్పదనం గురించి చెప్పమంటే మనోళ్లు అద్భుతంగా చెప్తారు. ఆమె సేవలు అమోఘం.. అద్వితీయం.. అసదృశ్యం.. ఆదర్శనీయం.. అనితరసాధ్యం అని కీర్తించి కిరీటం తొడిగినంత పనిచేస్తారు. కానీ ఎంతసేపు.? ప్రత్యేకమైన రోజు పరిసమాప్తం కాగానే మళ్లీ విజృంభించి విధిరాతను గుర్తుచేస్తారు. ఇంటా.. బయటా అంతటా ఇదే పరిస్థితి. అందుకే ముందు ఆడవాళ్లను ఆడిపోసుకోవడం మానాలి.

కల్పనలొద్దు

ఆడొళ్ల ముచ్చట అనగానే కొందరికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఉన్నది.. లేనిది కల్పించి చెప్పడానికి కాచుక్కొని కూర్చుంటారు. సింగర్ కల్పన మ్యాటరే తీసుకుందాం. ఎకాయెకిన ఆమె మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది.? ఎవరు కల్పించారు.? అని మనం ఆలోచించగలమా.? పాపం.. ఆమెకేదో హెల్త్ ప్రాబ్లం ఉండి పరేషాన్‌లో ఉంది. సోషల్ మీడియాలో ఆమె గురించి అడ్డగోలుగా రాస్తున్నారట. వినీ వినీ విసిగిపోయి.. ఆఖరికి మహిళా కమిషన్‌ను కన్సల్ట్ అయ్యింది కల్పన. ఆమె వేస్తున్న క్వశ్చన్ ఒక్కటే.. ‘వాస్తవాలు తెలుసుకోకుండా నాపై తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు.? నా భర్తతో నాకు గొడవలున్నాయని మీకెవరు చెప్పారు ?’అని. చూడాలి ఎవరు సమాధానం చెప్తారో.?

ఎందుకు ఫీలయ్యారు.?

ఎవరి ప్రాబ్రమ్స్ వాళ్లకుంటాయి. వాస్తవాలు తెలుసుకోకుండా ఏవేవో ఊహించుకొని ప్రచారం చేస్తే ఎలా.? వాస్తవ పరిస్థితులను వక్రీకరించే హక్కు ఎవరికుంది ? సాక్షాత్తూ కల్పనే చెప్తుంది కదా.? ‘నేను ఆత్మహత్యాయత్నం చేయలేదు. నా భర్తతో నాకు ఎలాంటి సమస్యలూ లేవు’అని. భర్తతో బాగనే ఉన్నానని ఆమెనే చెప్తున్నప్పుడు మనకంత ఆత్రమెందుకు ? అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ సమస్యా లేనప్పుడు ఈ తప్పుడు ప్రచారమే పెద్ద సమస్య అయి.. కుటుంబంలో ఇంకేదో సమస్యను క్రియేట్ చేస్తుందేమో అనే బాధ కావచ్చు ఆమెది. అందరూ హర్ట్ అయినట్టే కల్పన కూడా అయిందేమో.

ఎలా వస్తాయి.?

కల్పన ఇష్యూలో చాలామంది స్పందించారు. ‘ఆత్మహత్యకు కారణాలేంటి.?’, ‘రెండో భర్త నుంచి కూడా విడాకులు తీసుకుంటుందా.?’, ‘ఏ గాత్రం వెనుక ఏ గాయం దాగున్నదో.. ఏ నవ్వు వెనక ఏ నొప్పి దాగున్నదో’.. ఇలా రకరకాలుగా స్పందించారు. వీరిలో మానవతా దృక్పథంతో స్పందించినవాళ్లూ ఉన్నారు. సెన్సేషన్ కోసం రియాక్టయినవాళ్లూ ఉన్నారు. వ్యూస్.. లైక్స్ కోసం రాసినవాళ్లూ ఉన్నారు. సాటి మహిళకు ఆపదొచ్చిందని తెలిసి మానవతా కోణంలో స్పందించిన వాళ్లతో ఏ సమస్యా ఉండదు. కానీ.. పనిగట్టుకొని ఎవరి జీవతపు కన్నీళ్లనో కథా వస్తువుగా వండి వార్చే వాళ్లతోనే సమస్యంతా. అసలు వీళ్లకెలా వస్తాయో తప్పుడు ప్రచారం చేసి సంబరాలు చేసుకోవాలనే ఆలోచనలు.?

ఇంకెందరో.?

సింగర్ కల్పన విషయంలోనే కాదు. ఆడొళ్ల సబ్జెక్ట్ అనేసరికి ఇలాంటి పుకార్లు.. ప్రచారాలు.. ఎక్కువుంటాయి. ఫలానా అమ్మాయి కనిపించడం లేదని అడిగితే అయ్యో అవునా అనేవారికంటే.. ఎవరితో లేచిపోయిందో? అనే వారే ఎక్కువ. ఫలానా మహిళ భర్తతో వేరుగా ఉంటుందని తెలిస్తే.. ఏం పనిచేసిందో అందుకే మొగుడు ఇంట్లో నుంచి తన్ని తరిమేశాడని వినిపించే మాటలే ఎక్కువ. జీవితంలో మహిళ ఓడిపోతే చేతగాక ఓడిపోయిందంటారు. విజయం సాధిస్తే.. ఊకెనే సాధించిందా ఏం తిరకాసు నడిచిందో అని ప్రచారం చేస్తారు. సాటి మహిళపై రాళ్లేసే వాళ్లింట్లోనూ ఆడవాళ్లుంటారనే సోయి ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయా.? ఈ అభూతకల్పనలు ఎప్పుడు ఆగేనో.? ఆమె స్వేచ్ఛగా ఎప్పుడు బతికేనో.?

Next Story

Most Viewed