Danger Signs : కాళ్లు, చేతులు చల్లబడటం దేనికి సంకేతం.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?

by Javid Pasha |
Danger Signs : కాళ్లు, చేతులు చల్లబడటం దేనికి సంకేతం.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
X

దిశ, ఫీచర్స్ : అనుకోకుండా కాళ్లు, చేతులు చల్లబడుతున్నాయా? ఏమీ తోచకపోవడం, కళ్లు తిరగడం, పల్స్ పడిపోయిన అనుభూతితో ఆందోళనకు గురవుతున్నారా? అయితే ఈ లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే లోబీపీ లేదా హైపో టెన్షన్ వల్ల ఈ సమస్య తలెత్తుతుందని చెప్తున్నారు. ఈ సందర్భంలో శరీరంలోని అవయవాలకు తగినంతగా రక్తం సరఫరా కాపోవడంవల్ల మైకం, తీవ్రమైన అలసట కూడా సంభవిస్తాయి.

ఏం జరుగుతుంది?

హైపో టెన్షన్ కారణంగా రక్త ప్రసరణ సాధారణంకంటే మందగిస్తుంది. దీనివల్ల శరీరం తగిన ఉష్ణోగ్రతను నిర్వహించుకోవడంలో విఫలం చెందుతుందని నిపుణులు చెప్తున్నారు. దీని కారణంగానే పలు మార్పులు రావడం, కాళ్లు, చేతులు చల్లబడటం, పల్స్ రేట్ పడిపోవడం వంటివి సంభవిస్తాయి. అయితే ఏదో ఒకసారి ఈ సమస్య వచ్చిపోతే ఏమో కానీ.. నెలలో రెండుమూడు సార్లు ఇలాంటి పరిస్థితిని గనుక ఎదుర్కొంటే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నారు వైద్య నిపుణులు. కొన్నిసార్లు లోబీపీ అధికమైతే అది ప్రాణాంతకం కూడా అవుతుందని చెప్తున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

* రక్తపోటు తగ్గడం లేదా లోబీపీ రావడానికి పలు కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడంవల్ల ఇది సంభవిస్తుంది. కాబట్టి జాగ్రత్తలో భాగంగా ముందుగా బాడీని హైడ్రేట్‌గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం రోజూ ఏడెనిమిది గ్లాసులకు తగ్గకుండా నీరు తాగడం, తాజా పండ్లు తినడం, పండ్ల రసాలు తాగడం వంటివి చేయాలి. ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ వంటివి అస్సలు తీసుకోవద్దు.

* అలాగే భోజనం చేసే విషయంలోనూ కేర్ తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో నాలుగైదు సార్లు అయినా సరే తినడం మంచిది. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో భోజనం తినడం లోబీపీతో బాధపడే వారిలో ఆ సమస్యను మరింత పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇంకొంత మందికి పడుకొని లేవగానే ఒక్కసారిగా తల గిర్రున తిరిగిన అనుభూతి కలుగుతుంది. మైకం కమ్మేసినట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి కళ్లు స్పష్టంగా కనబడవు, వస్తువులు, మనుషులు సగం సగం కనిపించడం, పరిసరాలు కూడా మసకగా అనిపించడం జరుగుతుంది. ఇది కూడా హైపోటెన్షన్ కారణంగా సంభవిస్తుంది. కాబట్టి మీ సమస్య తగ్గేవరకు ఒకేచోట గంటల కొద్దీ కూర్చోవడం చేయకండి. అలాగే రోజూ వ్యాయామాలు చేయడం మంచిది.

* మీ అరికాళ్లు, అరచేతులు చల్లబడుతూ ఉంటే రక్తపోటు తగ్గుతున్నట్లు అనుమానించాలి. అలాంటప్పుడు తక్షణ ఉపశమనం కోసం వెచ్చని దుస్తులు ధరించండి. ఏసీని ఆఫ్ చేయండి. వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. తక్కువ రక్తపోటు వల్ల సెప్సిస్ వంటి సమస్యలతోపాటు అవయవాల పనితీరు మందగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా శాశ్వత పరిష్కారం కోసం తగిన చికిత్స తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed