Self Disclosure : బలమా.. బలహీనతా..? ఏ విషయాన్నీ దాచుకోలేకపోవడం దేనికి సంకేతం?

by Javid Pasha |   ( Updated:2024-11-14 14:33:02.0  )
Self Disclosure : బలమా.. బలహీనతా..? ఏ విషయాన్నీ దాచుకోలేకపోవడం దేనికి సంకేతం?
X

దిశ, ఫీచర్స్ : మీరు నిన్న ఆఫీసుకో, కాలేజీకో ఎగ్గొట్టి సినిమా కెళ్లారు.. ఎవరికీ చెప్పొద్దని ఫిక్స్ అయి పోతారు. మహా అయితే రెండు మూడు గంటలు ఆగుతారు. మరీ ఎక్కువంటే ఓ రోజంతా వెయిట్ చేస్తారు. ఆ తర్వాత అస్సలు ఆగరు. ఎవరో ఒకరితో ఓపెనైపోతారు. ఉండబట్ట లేక విషయం మొత్తం చెప్పేస్తారు. ఇలా ఏ ఒక్కరిద్దరో కాదు, ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిలో రహస్యాలు దాచలేని బిహేవియర్ కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు. ఇలాంటి వ్యక్తులనే ‘సెల్ఫ్ డిస్ క్లోజర్స్’గా పేర్కొంటున్నారు. ఇలా ప్రతీ విషయాన్ని ఇతరులతో పంచుకోవడం బలమా.. బలహీనతా?

సంతోషం కలిగినా, బాధ అనిపించినా, విజయం సాధించినా, ఓటమిని ఎదుర్కొన్నా.. ఇలా ప్రతీ అంశం షేర్ చేసుకుంటారు కొందరు. ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంటారు. చివరికీ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటారు. ఇక అలా చెప్తున్నప్పు సదరు వ్యక్తుల మాటలను ఆసక్తిగా వినడం, ఫీలింగ్స్‌కు అనుగుణంగా రెస్పాండ్ అవ్వడం చేస్తుంటే మరింత రెచ్చిపోతారు. ఇలా అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో ‘స్వీయ బహిర్గతం’ చేసుకునే హాబీస్ కలిగి ఉన్న వ్యక్తులు నిజానికి నిష్కల్మషమైన వారు కావచ్చు. వారి మాటల్లో, చేతల్లో ఎలాంటి స్వార్థం ఉండకపోవచ్చు. ఈ ప్రవర్తన సదరు వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను తెచ్చిపెడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

విచక్షణ ముఖ్యం

ప్రతీదీ షేర్ చేసుకోవడం కొందరి దృష్టిలో నేచురల్ బిహేవియర్‌గా అనిపించవచ్చు. అయితే ఎల్లప్పుడూ అది అలాగే ఉండదు. సహజమైన చర్యగా, మంచి ప్రవర్తనగానే అందరూ స్వీకరించకపోవచ్చు. ఉదాహరణకు మీరు పెళ్లికి ముందు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండును కలిగి ఉన్నారు.. కానీ బ్రేక్ అయింది. మొదటి నుంచి లాస్ట్ వరకు ఏం జరిగిందో ప్రతీ విషయాన్నీ ఉండబట్టలేక మీ క్లోజ్ ఫ్రెండుకో, మరొక వ్యక్తికో చెప్పేస్తారు. అది అంతటితో ఆగదు. విషయం మొత్తం పాకిపోతుంది. ఫైనల్లీ అది మీ కుటుంబంలో సమస్యలకో, మీ వ్యక్తిత్వానికి ఇబ్బంది కలిగించే అంశంగానో మారవచ్చు. అందుకే ఏదీ చెప్పాలో, ఏది చెప్పకూడదో అనే విషయంలో విచక్షణ జ్ఞానం అవసరం అంటున్నారు నిపుణులు. అన్ని వేళలా విషయాలను ‘స్వీయ బహిర్గతం’ చేసే వ్యక్తులగా ఉండటం మీలోని మంచి లక్షణం, బలమైన, స్వార్థమైన వ్యక్తిగ్వానికి నిదర్శనం కావచ్చు. కానీ సామాజిక పరిస్థితుల్లో అదే మీ బలహీనత కూడా అవుతుంది.

ఎందుకని అలా..

ఎక్కువ విషయాలను ఇతరులతో పంచుకోవడం మంచి నెట్వర్కును పెంచుతుందని, అనురాగం, ఆప్యాయతలను పెంచుతుందని కొందరు భావిస్తుంటారు. పైగా తమ అనుభవాలను ఎక్కువగా వినగలిగే వారితో పంచుకుంటూ ఉంటారు. ఇది స్నేహ బంధాన్ని, సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేస్తుండనడంలోనూ అతిశయోక్తి లేదు. కానీ కొన్ని సందర్భాల్లో సమస్యలను క్రియేట్ చేసే చాన్సెస్ ఉన్నాయంటున్నారు నిపుణులు. ‘సెల్ఫ్ డిస్ క్లోజర్స్’లోని వ్యక్తిత్వం, మంచితనం, ముక్కు సూటితనం కొన్నిసార్లు వారి మానసిక దౌర్భల్యానిక దారి తీయవచ్చు. ఇతరులల్లో భావోద్వేగాలను ప్రభావితం చేయవచ్చు.

పురుషులకు నష్టం

ప్రతీ విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకునే ప్రవర్తన మహిళలకంటే .. పురుషులకు ఎక్కువ నష్టం చేస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే మగవాళ్లు కొన్ని పర్సనల్ విషయాలను పంచుకోవడంవల్ల ఇతరుల వద్ద చులకనైపోవచ్చు. లేకపోతే ధైర్యం లేనివారిగా అవతలి వ్యక్తులు పరిగణించవచ్చు. ‘ఒక మగాడై ఉండి భయపడుతున్నాడు’ అనే పురుషాధిక్య భావజాలమే ఇక్కడ పురుషులను బలహీనులుగా పరిగణించడానికి దారితీస్తుంది. అందుకే విషయాలను అతిగా పంచుకునే వారు అది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా ఆలోచించుకోవాలంటున్నారు నిపుణులు.

స్త్రీల విషయంలో బెటర్

ప్రతీ విషయాన్ని షేర్ చేసుకునే ‘స్వీయ బహిర్గత’ వ్యక్తిత్వం పురుషులకు కొంత నష్టం చేస్తన్నప్పటికీ, వివాహిత స్త్రీలకు మాత్రం రిలాక్సేషన్ ఇస్తుందంటున్నారు నిపుణులు. ఇప్పుడున్న సామాజిక పరస్పర చర్యలను గమనిస్తే స్త్రీలు సహజంగానే ప్రేమ, కుటుంబ సమస్యలు, వ్యవహారాలు, తాము ఎదుర్కొన్న అనుభవాలను ఇతర స్త్రీలతో పంచుకుంటూ ఉంటారు. ఇది మంచి క్యమూనికేషన్‌గా, మంచి ప్రవర్తనగా భావించబడుతూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడూ అతి చొరవలు, విషయాలను ఎక్కువగా షేర్ చేసుకోవడం స్త్రీలలో కూడా సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి స్త్రీలైనా, పురుషులైనా ఓ పరిమితిలో, పరిధిలో ఉండటం బెటర్. కాబట్టి మీ అనుభవాలను, భావాలను, భావోద్వేగాలను ఇతరులతో పంచుకోవడం మీకు మేలు చేస్తోందా? లేదా కీడు చేస్తోందా? ఒకసారి పరిశీలించుకోండి. ఏ విషయంలోనైనా సెన్స్ ఆఫ్ బ్యాలెన్సింగ్ పాటించడం మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

Read More ...

World Diabetes Day : ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు!







👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story