Raining: వానల్లో హాయ్.. హాయ్.. రెయినీ సీజన్‌లో మాత్రమే ఆస్వాదించగలిగే ఆనంద భరిత క్షణాలు!

by Javid Pasha |
Raining: వానల్లో హాయ్.. హాయ్.. రెయినీ సీజన్‌లో మాత్రమే ఆస్వాదించగలిగే ఆనంద భరిత క్షణాలు!
X

దిశ, ఫీచర్స్ : ‘‘కాస్త ఆలోచించి చూడాలే కానీ ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆస్వాదించే ఆసక్తి ఉండాలే కానీ ప్రతీ క్షణాన్ని, ప్రతీ సందర్భాన్ని ఎంజాయ్ చేయవచ్చు’’ అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ప్రస్తుత రెయినీ సీజన్‌ను కూడా మీరు అందుకు అనుగుణంగా మల్చుకోవచ్చునని చెప్తున్నారు. నిజానికి డైలీ రొటీన్స్‌లో భాగంగానే వర్షాకాలంలో ఎన్నో మధురమైన క్షణాలను స్ఫూర్తిగా స్వీకరించడం, ఆస్వాదించడం ద్వారా మనం జాయ్ ఫుల్‌గా ఉండవచ్చు. అలాంటి అరుదైన సందర్భాలు ఏమిటో, ఎలా ఆస్వాదించవచ్చునో ఇప్పుడు చూద్దాం.

ప్రతీ క్షణం ఆనందమయం

సాధారణంగానే ప్రతీ క్షణం ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు వానాకాలం ఒక చక్కటి అవకాశం. ఇక్కడ వరదలు, అధిక వర్షాల వల్ల కలిగే సమస్యల గురించి మనం ఇప్పుడు చర్చించడం లేదు. కేవలం హ్యాపీనెస్ గురించి మాత్రమే డిస్కస్ చేసినట్లయితే.. వానాకాలం ప్రకృతి పరంగా ఆనందాన్ని కలిగించే అద్భుతమైన సీజన్. కురిసే చిరు జల్లులైనా, జడి వానలైనా పచ్చటి ప్రకృతికి ప్రాణం పోస్తాయి. సిటీలల్లో ప్రకృతి అందాలను పెద్దగా ఆస్వాదించలేం కానీ.. వానాకాలంలో రూరల్ ఏరియాలకు వెళ్లి చూస్తే ఆ మజానే వేరు అంటున్నారు నేచర్ లవర్స్. నేలకు రంగేసినట్టు ఆకు పచ్చని గడ్డి మైదానాలు, పచ్చని చెట్లు, వాగులు దుంకుతున్న చెరువులు ఇలా.. వాన కాలంలో ఏది చూసినా కలిగే ఆనందం ఇంకే సీజన్‌లో కలగదేమో!

ఉదయంపూట బాల్కానీలో..

వానాకాలంలో మనకు అత్యంత సంతోషాన్ని కలిగించే మరో మధుర క్షణం ఏంటంటే.. ఉదయం లేవగానే ఇంటి ముందు వాకిట్లోనో, బాల్కానీలో కుర్చీపైనో కూర్చొని కాఫీ లేదా టీ తాగడం. ఎంతో మందికి వర్షాకాలంలో ఈ అలవాటు, అందుకు తగిన ప్రకృతి దృశ్యం అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. కొందరికైతే చిరు జల్లలును ఆస్వాదిస్తూ.. పచ్చని ప్రకృతిని చూస్తూ ఒక కప్పు కాఫీ తాగకపోతే మనసు కుదుట పడదు. అంత గొప్ప ఆకట్టుకునే ప్రకృతి సౌందర్యం కేవలం వానాకాలంలోనే మనల్ని అలరిస్తుంది.

సంగీతం వింటూ..

వర్షాకాలంలో బయటకు వెళ్లేని పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ముఖ్యంగా గృహిణులు, ఇండ్లల్లోనే ఉండే పెద్ద మనుషులు, ఇక ఉద్యోగులు, విద్యార్థులైతే వీకెండ్స్‌లో వర్షాకాలాన్ని మస్తు ఎంజాయ్ చేయవచ్చు అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఖాళీగా ఉన్నప్పుడు, సెలవు రోజుల్లో ఆలస్యంగా లేచినా, ఉదయాన్నే లేచినా ఆరు బయటకు వెళ్తూ.. పొలం గట్లపోంటి తిరుగుతూ ఇష్టమైన సంగీతాన్నో, నచ్చిన జాన పదాన్నో వింటే కలిగే ఆనందమే వేరు. కాబట్టి వర్షాకాలాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవద్దు అంటుంటారు నేచర్ లవర్స్.

సరదా సన్నివేశాలు.. అరుదైన సందర్భాలు

మిగతా సీజన్లతో పోలిస్తే రెయినీ సీజన్‌లో ఉండే సరదాలు, సంతోషాలు, నలుగురు కలిసినప్పుడు సంభాషణలు వేరుగా ఉంటాయి. ఫ్రెండ్స్ అంతా కలిసి ఏ జలపాతాలనో తిలకిస్తూ సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపేయవచ్చు. గ్రామాల్లో ఉన్నవారైతే ఏ చెరువు వద్దకో వెళ్లి చేపలను పట్టుంటూ.. పారుతున్న అలుగులను, ప్రకృతి ఒడిలో విరబూసిన గడ్డి మొక్కలను చూసి ఆనందించవచ్చు. గాలికి ఊగుతున్న లేలేత గడ్డిపరకలు, కాస్త ఎండ తగలగానే ఎగురుతూ కనిపించే తూనీగలు, రంగు రంగుల సీతాకోక చిలుకలు, రకరకాల కీటకాలు దర్శనమిచ్చేది కేవలం వర్షాకాలంలోనే. అందుకే వానా కాలాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించడం కంటే మించిన ఆనందం మరొకటి లేదంటారు పెద్దలు.

నింగిన మెరిసే రంగుల సింగిడి

వర్షం కురిసి ఆగిపోయాకో, వాన రావడానికి ముందుగానో మీరెప్పుడైనా ఆకాశంవైపు చూశారా? ఎంత నిర్మలంగా ఉంటుంది కదూ.. కొన్నిసార్లు వివిధ రంగులతో కూడిన ఒక వంపు తిరిగిన ఆకారం కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. దానినే ఇంద్ర ధనస్సు అంటారు. గ్రామాల్లో అయితే కొందరు సింగిడి అని పిలుస్తుంటారు. అత్యంత ఆనందాన్ని కలిగించే అద్భుతమైన సందర్భం, దృశ్యమాన సన్నివేశం కూడా ఈ రంగుల సింగిడి. దీంతోపాటు రాత్రిళ్లు మిణుకు మిణుకు మంటూ మెరిసే మిణుగురులు, జలాశయాల్లో కప్పల బెకబెక శబ్దాలు, ఆకాశంలో మెరిసే నక్షత్రాలు వానాకాలంలో మధురానుభూతిని కలిగిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed