- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Friendship day 2024: నిజమైన స్నేహానికి నిదర్శనమేది?
దిశ, ఫీచర్స్ : ‘‘నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను అర్థం చేసుకునేవారు.. నీవు ఏ స్థాయిలో ఉన్నా గౌరవించేవారు.. నీవు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వారు’’ నిజమైన స్నేహం గురించి నిపుణులు ఇలా వర్ణించారంటేనే.. దాని గొప్పదనమేంటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్నేహంవల్ల మీలోని ఆందోళన దూరం అవుతుంది. ఆనందం ఏర్పడుతుంది. అదే కదా రియల్ అండ్ హెల్తీ ఫ్రెండ్‌షిప్‌కు నిదర్శనం అంటున్నారు నిపుణులు.
జీవితంలో పరిచయాలు చాలా మందితో ఉంటాయి. కానీ చొరవ కొందరితోనే ఉంటుంది. మీ గురించి ఆలోచించేవారు చాలా మందే ఉంటారు. కానీ నిస్వార్థంగా ఆలోచించేవారు కొందరే ఉంటారు.. వాళ్లే మీ నిజమైన స్నేహితులు. ఈ ప్రపంచమంతా ఒక్కటై మీ మీద యుద్ధం ప్రకటించినా సరే.. వారు మాత్రం మీ తరఫునే నిలుస్తారు. మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. కష్టాల నుంచి గట్టెక్కించే మార్గం చూపుతారు. ఆలోచనల్లో, ఆచరణలో మీ వెన్నంటే ఉంటారు. అందుకే స్నేహం గొప్పదని, విలువైనదని అంటుంటారు పెద్దలు.
మంచీ.. చెడు
ఈ రోజుల్లో అంత మంచి స్నేహితులు ఎవరూ ఉండటం లేదని కొందరు పెద్దలు చెప్తుంటారు. ఇది కూడా ఒకింత నిజమే కావచ్చు. మన మంచి కోసం చెప్పే జాగ్రత్త కూడా కావచ్చు. కానీ అందరూ అలాగే ఉండరు. సమాజంలో మంచీ చెడూ ఉంటాయి. కొందరు చెడు స్నేహాల వల్ల నష్టపోయి ఉండవచ్చు. అంత మాత్రనా మిగతా వారందరకీ అదే వర్తించదు. ఫైనల్లీ.. స్నేహం ఒక భరోసా, స్నేహం ఒక ధైర్యం. స్నేహం ఒక ఆత్మస్థైర్యం.
బెస్ట్ ఫ్రెండ్‌షిప్
ప్రేమలో వైఫల్యాలుంటాయి. రిలేషన్‌షిప్ బ్రేకప్‌లు ఉంటాయి. కానీ ఇలాంటివేమీ స్నేహంలో ఉండవు. కాకపోతే.. బిజీ లైఫ్‌లో కొందరు రెగ్యులర్‌గా కలుసుకోకపోవచ్చు. తాత్కాలికంగా దూరమై ఉండవచ్చు. కానీ హృదయాంతరాల్లో స్నేహ మాధుర్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ భూమిపై మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడున్నా సరే.. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటారు. మీకు ఏమీ తోచనప్పుడు, ఆపదలో చిక్కుకున్నప్పుడు, ఆవేదన చెందుతున్నప్పుడు నాకెందుకులే.. అనుకునేవారు ఎందరో ఉంటారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి.. ఆ క్షణంలో మీ గురించే ఆలోచిస్తారు. మీకు సపోర్టుగా ఉంటారు. అతనే/ఆమెనే మీ బెస్ట్ ఫ్రెండ్.
భేద భావాలు లేనిది..
ఫ్రెండ్‌షిప్ అంటేనే అంత.. దానికి కుల మత భేదాలుండవు. పేద ధనిక తేడాలుండవు. ఆడా మగా అనే భేద భావాలుండవు.. వివక్షలు అస్సలుండవు. అందుకే స్నేహం చాలా గొప్పది. అలాంటి స్నేహాన్ని మరోసారి గుర్తు చేసుకొని, మనసు నిండా సంతోషాన్ని నింపుకొని, మన జీవితంలో కూడా ఎంతోమంది స్నేహితులు ఉన్నందుకు కృతజ్ఞతను ప్రకటించుకునేందుకు ఓ సందర్భం రానే వచ్చింది. అదే ఫ్రెండ్ షిప్ డే. సందర్భం కాబట్టి హెల్తీ ఫ్రెండ్‌షిప్ గురించి తప్పక తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. అలాంటప్పుడే టాక్సిక్ ఫ్రెండ్‌షిప్‌కు దూరంగా ఉంటామని చెప్తున్నారు. నిజమైన స్నేహితుల లక్షణాలేమిటో వెల్లడిస్తున్నారు.
రహస్యాలు సేఫ్
జీవితమన్నాక అన్ని విషయాల్లోనూ ఓపెన్‌గా ఉండలేం. కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. అలాగనీ వాటిని మనసులోనే దాచుకొని ఉండలేం. ఎవరో ఒకరితో చెప్పుకోవాలనిపిస్తుంది. వాళ్లతో చెప్పుకున్నా తమ సీక్రెట్స్‌కు ఢోకాలేదని, ప్రైవైసీ ప్రాబ్లం ఉండదని భావిస్తారు. అలా ఎవరి గురించి అయితే అనుకుంటారో వాళ్లే నిజమైన స్నేహితులు. అలాగే మీరు మీలా ఉండాలని ప్రోత్సహిస్తారు. మీ ముందు ఒకలా, మీ వెనుకాల మరోలా ప్రవర్తించరు. అన్ని పరిస్థితుల్లోనూ మీతో మంచిగానే మెలుగుతారు. మీ అభిప్రాయాలను, సరిహద్దులను గౌరవిస్తారు. అనుమానం అవసరం లేదు. ఇవన్నీ హెల్తీ ఫ్రెండ్‌షిప్ లక్షణాలే.
అసూయ అసలే లేనిది..
మీరు ఏదైనా సాధించిన ప్రతీసారి మీ ఫ్రెండ్ అసూయ చెందుతున్నట్లయితే అది ప్రవర్తనలో, మాటల్లో, చేతల్లో ఇలా ఏదో ఒక రూపంలో ప్రదర్శిస్తుంటారు. అప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు. అది నిజమైన స్నేహితుల లక్షణం కాదని. ఎందుకంటే రియల్ ఫ్రెండ్ అయితే మీ సక్సెస్ గురించి గర్వపడాలి. మిమ్మల్ని ప్రోత్సహించాలి. అంతేతప్ప అసూయ చెందమో, పోటీగా భావించడమో చేయరు. ఈ సంకేతాలను బట్టి మీ ఫ్రెండ్ ఎవరో గుర్తించవచ్చు. అలాగే నిజమైన స్నేహితులు మీవద్ద నటించరు. మీ గురించి నలుగురిలో చెడుగా చెప్పరు. ఎవరైనా తప్పుగా మాట్లాడినా అవైడ్ చేస్తారు. కొన్నిసార్లు పొరపాటు మీదే అయినా సర్ది చెప్తూ మార్చే ప్రయత్నం చేస్తుంటారు తప్ప మిమ్మల్ని దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో బిహేవ్ చేయరు.
ఎల్లప్పుడూ పోర్టుగా నిలిచేది..
జీవితంలో ఎంతోమంది మీకు మేమున్నాం అని చెప్తుంటారు. కానీ ఆచరణలో నిలిచేది ఎంతమంది? అలా నిలిచేవారే మీ నిజమైన స్నేహితులు అంటున్నారు నిపుణులు. ఆనందంలో ఉన్నప్పుడు మీతో ఉండి, ఆపదలో ఉన్నారని తెలియగానే పారిపోయేవారో, తప్పించుకునేవారో ఎప్పటికీ మంచి స్నేహితులు కాలేరు. అన్ని సందర్భాల్లోనూ ఆలోచనల్లో, ఆచరణలో మీకు తోడుగా, మద్దతుగా నిలిచేవారే నిజమైన, నమ్మకమైన స్నేహితులు.