జూ నుండి పారిపోయిన ఫ్లెమింగో, 17 ఏళ్ల త‌ర్వాత ఇలా క‌నిపించింది..?! (వీడియో)

by Sumithra |   ( Updated:2022-04-02 10:29:45.0  )
జూ నుండి పారిపోయిన ఫ్లెమింగో, 17 ఏళ్ల త‌ర్వాత ఇలా క‌నిపించింది..?! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః స‌జీవ‌మైన‌ది ఏదైనా స్వేచ్ఛ‌గా బ‌త‌కడానికే ఇష్ట‌ప‌డుతుంది. అవ‌స‌రం కోసం బంధీగా ఉన్నా, అవ‌కాశం దొరికితే స్వేచ్ఛా ప్ర‌పంచంలోకే పారిపోతుంది. స‌రిగ్గా ఇలాగే, సుమారు 17 సంవత్సరాల క్రితం, అమెరికాలోని కాన్సాస్‌లో ఉన్న‌ జంతుప్రదర్శనశాల నుండి 492 నెంబ‌రుగ‌ల‌ ఓ ఆఫ్రికన్ ఫ్లెమింగో ధైర్యంగా త‌ప్పించుకొని పారిపోయింది. అయితే, అనుకోకుండా మళ్లీ ఇప్పుడు అది క‌నిపించ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. పింక్ ఫ్లాయిడ్ అనే ముద్దు పేరున్న ఈ ఫ్లెమింగో పారిపోయిన ప్రాంతం నుండి దక్షిణాన 700 మైళ్ల (1,100 కిలోమీటర్లు) దూరంలో ఉన్న టెక్సాస్‌లో ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. 2005లో, సెడ్గ్విక్ కౌంటీ జూలో దాని రెక్కలను క్లిప్ చేస్తున్న స‌మ‌యంలో కీపర్లు ఫెయిల్ కాగా ఫ్లెమింగో త‌ప్పించుకొని పారిపోయింది. వాస్త‌వానికి, అడవిలో ఫ్లెమింగో మనుగడ సాగించ‌డం అసంభవం కూడా. కానీ, ఫింక్ ఫ్లాయిడ్ ఇన్నేళ్లుగా జీవించే ఉండ‌టం, నీటి మ‌ధ్య‌లో క‌న‌బ‌డ‌టం అధికారుల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

ఫిషింగ్ గైడ్ డేవిడ్ ఫోర్‌మాన్ దీన్ని గుర్తించారు. టెక్సాస్ గల్ఫ్ తీరంలోని పోర్ట్ లావాకాలో త‌న ఫ్రెండ్ గార్డియ‌న్‌తో కలిసి చేపలు పట్టడానికి ఫోర్‌మాన్ వెళ్లిన‌ప్పుడు, ఒక కాలు మీద కూర్చున్న 'పూఫ్-బాల్' లాగా ఉన్న‌ పక్షిని గ‌మ‌నించారు. అది ముందుకు వెనుకకు పరుగెత్తుతుంది. ఎగిరిపోకుండా, కేవ‌లం వాళ్ల‌ నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఆ పక్షిని వీడియో తీసిన‌ ఫోర్‌మాన్ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. అప్పుడు కొంద‌రు దాన్ని చూసి, ఇదేదో పారిపోయిన ఫ్లెమింగో లా క‌నిపిస్తుంద‌న్నారు. వెంట‌నే, ఫోర్‌మాన్ టెక్సాస్ పార్కులు, వన్యప్రాణుల విభాగానికి వీడియోను ట్యాగ్ చేశాడు. అలా పారిపోయిన ఫ్లెమింగో, 17 ఏళ్ల త‌ర్వాత‌ దొరికింద‌ని అధికారులు ట్విట్టర్‌లో ధృవీకరించారు. ఇక‌, అదే జూ నుంచి త‌ప్పించుకున్న‌ మరో ఫ్లెమింగో నెం-347 కూడా పారిపోగా, దాని జాడ‌ ఇంకా తెలియ‌లేదు.

Advertisement

Next Story

Most Viewed