Study : పరీక్షలంటే ఆందోళన వద్దు.. ఇలా చేయండి చాలు!

by Javid Pasha |
Study : పరీక్షలంటే ఆందోళన వద్దు.. ఇలా చేయండి చాలు!
X

దిశ, ఫీచర్స్ : ఫిబ్రవరి, మార్చి అంటేనే స్కూళ్లు మొదలు కొని కాలేజీ పిల్లల వరకు కాస్త ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే.. ఇది వార్షిక పరీక్షలకు ప్రిపేర్ అయ్యేకాలం. ఓ వైపు స్టడీలో బిజీ బిజీగా గడుపుతుంటే.. మరోవైపు పేరెంట్స్, టీచర్స్ బాగా చదవాలని ఒత్తిడి తెస్తుంటారు. దీంతో కొందరు నిద్ర, ఆహారం కంటే చదువుపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. అయితే అధిక ఒత్తిడి మధ్య చదవడం, సమయానికి తినకపోవడం వంటి పరిస్థితులు జ్ఞాపక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, చివరికి సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్టూడెంట్స్, వారి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు.

*ఆహారాలు : పరీక్షల కోసం చదవడం ముఖ్యమే. కానీ మరీ అధిక ఒత్తిడి మంచిది కాదు. ఇక ఎలా చదివినా కొంత ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఉపశమనం కోసం, మెదడు యాక్టివ్‌గా పనిచేయడం కోసం తగిన ఆహారాలు కూడా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పాలు, పెరుగు, వాటితో తయారు చేసిన పదార్థాలు, ఎగ్స్ తీసుకోవాలి. అరటి, యాపిల్, బొప్పాయి, సపోటా వంటి పండ్లు శక్తినివ్వడంతోపాటు ఒత్తిడిని ఎదుర్కోవడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని నిపుణులు అంటున్నారు

*హైడ్రేటెడ్‌గా ఉండండి : శరీరం హైడ్రేడ్‌గా లేకపోతే చదివింది మర్చిపోతారు. అందుకే మీరు చదువున్నప్పుడు పక్కనే ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ ఫుల్లుగా ఉండేలా చూసుకోండి. సమ్మర్ ప్రభావం ఉంటుంది కాబట్టి సాధారణ నీటితోపాటు పుదీనా ఆకుల జ్యూస్ లేదా లెమమన్ జ్యూస్ వంటివి కూడా తీసుకోవడం బెటర్. దీనివల్ల శరీరం డీ హ్రెడేషన్‌‎కు గురికాకుండా ఉంటుంది. ఇక చిరాకు కలిగించడంలో దోహదపడే కెఫిన్, నికోటిన్, ఆల్కహాల్ అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండండి. బాడీలో వాటర్ లెవల్ తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం రోజూ కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలని నిపుణులు చెబుతున్నారు.

*జ్ఞాపకశక్తిని పెంచుకునే మార్గం : సమయానికి తినకపోవడం వల్ల తీరా పరీక్షలు రాసే సమయానికి ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది జ్ఞాపశక్తి తగ్గడానికి కారణం అవుతుంది. కాబట్టి ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకండి. టైమ్ టు టైమ్ భోజనం చేస్తూ ఉండండి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెమోరీ పవర్ పెంచుతాయి. చేపలు, వాల్‌నట్స్, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు, నువ్వులు, సోయాబీన్‌ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు గంటల తరబడి ఏక ధాటిగా చదవ కూడదు. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. తగినంత నిద్ర కూడా ముఖ్యం. రోజూ 7 నుంచి 8 గంటలు నిద్ర పోయేలా చూసుకోండి. నిద్రపోకుండా చదవడం వల్ల గుర్తుండే అవకాశం తక్కువ.

*షెడ్యూల్ చేసుకోండి : పరీక్షలు దగ్గర పడుతున్నాయనే ఒత్తిడిలో ఎలాపడితే అలా చదివినా ఫలితం ఉండదు. అందుకే ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలనే విషయంలో ఒక ప్లాన్ రూపొందించుకోండి. దేనికి ఎంత సమయం కేటాయిస్తారో మీ ఆసక్తిని, అనుకూలతను బట్టి నిర్ణయించుకోండి. అట్లనే అసలే ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి. ఆ సమయంలో కాస్త ఫ్రీ టైమ్ దొరకగానే ఫోన్ చేతిలో పట్టుకుని అందులో నిమగ్నమై పోవద్దు అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఒత్తిడి మరింత పెరిగి, ఏకాగ్రత లోపిస్తుందని చెబుతున్నారు. కాబట్టి విద్యార్థులు పరీక్షల సీజన్‌లో మొబైల్ ఫోన్ పక్కన పెట్టాలంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లపై మరీ ఒత్తిడి పెంచకుండా సహకరించాలని సూచిస్తున్నారు.

Next Story

Most Viewed