Overweight : వామ్మో.. లావెక్కిపోతున్నాంగా..!!

by Javid Pasha |   ( Updated:2025-02-28 14:47:33.0  )
Overweight : వామ్మో.. లావెక్కిపోతున్నాంగా..!!
X

దిశ, ఫీచర్స్ : ఊబకాయం లేదా అధిక బరువు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని వేదిస్తున్న సమస్యల్లో ఇదొకటి. డబ్ల్యుహెచ్‌ఓ రిపోర్ట్ ప్రకారం 250 మిలియన్లకు పైగా ప్రజలు దీనివల్ల సఫర్ అవుతున్నారు. భారత దేశంలోనూ ఇది విస్తరిస్తోంది. పలు అనారోగ్యాలకు దారితీస్తోంది. అందుకే బరువు తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

ప్రధాని ప్రస్తావన..

ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ కూడా మన్ కీ బాత్‌లో అధిక బరువు విషయాన్ని ప్రస్తావించారు. ఊబకాయం అనారోగ్యాలకు కారణం అవుతోందని, పిల్లల్లో అది నాలుగు రెట్లు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని జాగ్రత్తలు తీసుకంటే అధిగమించవచ్చునని పేర్కొన్నారు. అందుకోసం ప్రతీనెల ఆహారంలో 10 శాతం తక్కువ నూనెను ఉపయోగించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఒబేసిటీ అంశం మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఎత్తుకు తగిన బరువున్నారా?

కొందరు హైట్ తక్కువగా ఉండి.. బరువు ఎక్కువగా ఉంటారు. మరి కొందరు హైట్ ఎక్కువగా ఉండి బక్క పలుచగా కనిపిస్తుంటారు. అసలు ఎత్తుకు బరువుకు సంబంధం ఏంటి? అనుకోకండి. అదే కీలకం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇటీవల అనేకమందిని ఊబకాయం లేదా అధిక బరువు సమస్య వేధిస్తోంది. అలా జరగకుండా ఉండాలంటే ఎవరెంత బరువు ఉండాలో తెలుసుకోవాల్సిందే మరి. అందుకు బీఎంఐ కొలతలే ప్రామాణికం.

బీఎంఐ (BMI) అంటే?

బీఎంఐ.. పూర్తిపేరు బాడీ మాస్ ఇండెక్స్.. ఒక వ్యక్తి తన వయసు, ఎత్తుకు తగిన బరువు ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించే కొలత లేదా సాధనం. దీని గురించి తెలిసి ఉండటంవల్ల ఊబకాయం సమస్యను అధిగించేందుకు తగిన అవగాహన ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో కొవ్వు శాతాన్ని అంచనా వేయడానికి ఇదో చక్కటి మార్గం.

ఎందుకు వస్తున్నది?

జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతోమంది అధిక బరువు (స్థూలకాయం) సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహార నియమాలు పాటిస్తుంటారు. వ్యాయామాలు చేస్తుంటారు. వాస్తవానికి ఏ వయసు వారు ఎంత బరువు ఉండాలనేది వైద్య శాస్త్రంలో కచ్చితమైన నియమం ఉందంటున్నారు నిపుణులు. అదే బాడీ మాస్ ఇండెక్స్ (Body Mass Index) బరువు పెరగడంవల్ల అనేక వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. అందుకని దానిని తగ్గించుకోవాలని చెబుతున్నారు.

ఎలా కొలుస్తారు?

వాస్తవానికి ప్రతీ ఒక్కరి శరీరం, ఎత్తు, బరువు వేర్వేరుగా ఉంటాయి. సరైన సమయంలో బరువును నియంత్రించుకోకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఉదాహరణకు 5 అడుగుల ఎత్తు గల వ్యక్తి బరువు 60 కిలోలు ఉన్నట్లయితే ఆ వ్యక్తి బీఎంఐ 25.54 అవుతుంది. దీన్ని ఈ ఫార్ములాలో సెట్ చేయడానికి, ముందుగా ఎత్తును మీటర్లుగా మార్చాలంటున్నారు నిపుణులు. 5 అడుగుల ఎత్తు అంటే వ్యక్తి ఎత్తు 1.53 మీటర్లు. ఇప్పుడు 1.53 మీటర్లను 1.53 మీటర్లతో గుణించాలి. ఇది 2.35 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు 60 కిలోల బరువును 2.35తో భాగించాలి. దీని తర్వాత మిగిలినవి 25.54 అవుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి బీఎంఐ లెక్కిస్తారు. సాధారణంగా 25 బీఎంఐ అనేది ఎత్తుకు తగిన బరువుగా పరిగణిస్తారు. అయితే 5 అడుగులు పొడవున్న వ్యక్తి 60 కిలోల బరువు ఉంటే అధిక బరువు ఉన్నట్లు లెక్క.

ఏ లెక్క ఏం చెబుతుంది?

ఒక వ్యక్తి బీఎంఐ 18. 5 నుంచి 24.9 మధ్య ఉంటే అది సరైన బరువుగా పరిగణిస్తారు. కానీ బీఎంఐ 18.5 కంటే తక్కువ ఉంటే, ఆ వ్యక్తి తక్కువ బరువుతో ఉన్నట్లు పరిగణిస్తారు. ఇక బీఎంఐ 25 నుంచి 29.9 మధ్య ఉంటే.. ఇలా ఉన్న వ్యక్తి అధిక బరువు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అట్లనే ఒక వ్యక్తి బీఎంఐ 30 కంటే ఎక్కువ ఉంటే అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నట్లు లెక్క.


పట్టిక - 1


బీఎంఐ ఫలితాలు.. అర్థం


బీఎంఐ 18.5 కంటే తక్కువుంటే = తక్కువ బరువు

బీఎంఐ 18.5 నుంచి 24.9 = ఆరోగ్యకరమైన/సాధారణ బరువు

బీఎంఐ 25 నుంచి 29. 9 = అధిక బరువు

30.0 - 34.9 = ఊబకాయం

35 లేదా అంతకంటే ఎక్కువ = అత్యంత ఊబకాయం


పట్టిక - 2


ప్రామాణిక బరువు , బీఎంఐ


ఆరోగ్యకరమైన బరువు 18.5 - 24.9

అధిక బరువు 25.0- 29.0

ఊబకాయం 30.0 - 34.09

అత్యంత ఊబకాయం 35.0 అంతకంటే ఎక్కువ


పట్టిక - 3


పురుషులు, మహిళల సగటు బరువు ఎంత ఉండాలి?

వయసు, పురుషుల బరువు, మహిళల బరువు

12 - 14 సంవత్సరాలు 32 - 38 కిలోలు 32 - 36 కిలోలు

15 - 20 సంవత్సరాలు 40 - 50కిలోలు 45 కిలోలు

21 - 30 సంవత్సరాలు 60 -70 కిలోలు 50 - 60 కిలోలు

31 - 40 సంవత్సరాలు 59 - 75 కిలోలు 60 - 65 కిలోలు

40 - 49 సంవత్సరాలు 80- 90.9 కిలోలు 66 - 76.2 కిలోలు


*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed