LIC : మూడు ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ తర్వాతే ఎల్ఐసీ ఐపీఓ

by Harish |   ( Updated:2021-07-29 21:36:41.0  )
LIC Jeevan Lakshya Plan
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది ప్రారంభంలో దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) మెగా ఐపీఓకు ప్రభుత్వం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఎల్ఐసీ ఐపీఓ కంటే ముందుగా కనీసం మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, మిశ్ర థాతు నిగమ్ లిమిటెడ్, రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ సంస్థలను వచ్చే త్రైమాసికంలో ఆఫర్ ఆన్ సేల్ ద్వారా విభజించనున్నట్లు ఆయన తెలిపారు. ‘వచ్చే ఏడాది మొదట్లోనే ఎల్ఐసీ ఐపీఓ మార్కెట్లలోకి తీసుకురావాలని లక్ష్యంగా ఉన్నాము.

దానికంటే ముందు ఈ మూడు సంస్థలకు సంబంధించిన ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నామని’ ఆయన వివరించారు. ఈ నెల ప్రారంభంలో ఎల్ఐసీ లిస్టింగ్‌కు ఆర్థిక వ్యవహారాల కేమినెట్ కమిటీ అనుమతిచ్చింది. పరిశ్రమల అంచనాల ప్రకారం.. బీమా సంస్థలో 10 శాతం వాటా విక్రయించి రూ. 1-1.5 లక్షల కోట్లను ప్రభుత్వం సేకరించనుంది. దీనికి సమాంతరంగానే ఎయిర్ ఇండియా, బీపీసీఎల్ సంస్థల్లో ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిర్వహించనుంది. కాగా, ఎల్ఐసీ లిస్టింగ్ కంటే ముందు పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టే మూడు సంస్థల్లో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ప్రభుత్వానికి 74 శాతం వాటా ఉండగా అందులో 20 శాతం వాటాను ఉపసంహరించుకోనుంది. అలాగే, రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్‌లోని 75 శాతంలో 10 శాతాన్ని, మిశ్ర థాతు నిగమ్ లిమిటెడ్‌లో 74 శాతం నుంచి 10 శాతం పెట్టుబడులను ప్రభుత్వం ఉపసంహరించనుంది.

Advertisement

Next Story

Most Viewed