కరోనా కేసులు తగ్గినయ్.. అసలు రీజన్ ఇదే

by Shyam |   ( Updated:2020-08-17 23:13:12.0  )
కరోనా కేసులు తగ్గినయ్.. అసలు రీజన్ ఇదే
X

దిశ, న్యూస్ బ్యూరో: సెలవు రోజులు, ఆదివారాల్లో రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రోజువారీ జరుగుతున్న టెస్టులతో పోలిస్తే సగం కంటే తగ్గిపోతున్నాయి. పంద్రాగస్టు, ఆదివారం వరుసగా రావడంతో ఈ రెండ్రోజుల్లో కొవిడ్ టెస్టుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మరోవైపు వర్షం ఏకధాటిగా కురుస్తుండటం కూడా ఇందుకు కారణమైంది. పంద్రాగస్టు రోజున కేవలం 12,120 టెస్టులు మాత్రమే జరిగితే మరుసటిరోజైన ఆదివారం కేవలం 8,794 మాత్రమే జరిగాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అంతే స్థాయిలో తగ్గిపోయింది. కరోనా అనుమానితులు టెస్ట్ కోసం వచ్చే సెంటర్లలో ఎలాంటి షెల్టర్లు ఉండటం లేదు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రిలో సెంటర్ దగ్గర చెట్లకిందనే ఉండాల్సి వస్తోంది. అమీర్‌పేట్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ఇదే పరిస్థితి. సీనియర్ సిటిజన్‌లు కూడా గంటల తరబడి టెస్టు కోసం నిల్చోవాల్సి వస్తోంది. ఉదయం 8 గంటలకే వచ్చినా ఫారం నింపిన తర్వాత ఎస్ఎంఎస్ వచ్చి నాలుగు గంటలైనా..శాంపిల్ తీసుకోవడానికి పేరు రావడంలేదని రిటైర్డ్ ఉద్యోగి ఒకరు వాపోయారు.

నెల నుంచి సెలవుల్లో అదే పరిస్థితి..

నెల రోజులుగా సెలవు దినాల్లో కరోనా పరీక్షలు తక్కువగా జరుతున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే..గత నెల 26 (ఆదివారం)న కేవలం 9,817 శాంపిళ్ల కలెక్షన్ మాత్రమే నమోదయ్యాయి. దానికి ముందు రోజున 15,654 శాంపిళ్ల కలెక్షన్ జరిగింది. ఈ నెల 2వ తేదీ (ఆదివారం)న 9,443, 10 న 11,609, 15 (పంద్రాగస్టు)న 12,120, 16 (ఆదివారం)న 8,794 శాంపిళ్ల కలెక్షన్ మాత్రమే జరిగింది. రోజూ సగటున 20 వేలకంటే ఎక్కువ టెస్టులే జరుగుతున్నాయి. అయితే, సెలవు రోజుల్లో టెస్టుల సంఖ్య తగ్గిపోతుండటంతో పాజిటివ్ సంఖ్య కూడా తగ్గుతోంది. సెలవురోజులు, ఆదివారాల్లో వైద్యారోగ్య సిబ్బంది తగ్గిపోవడంతో టెస్టులు తగ్గిపోతున్నాయి. అయితే, టెస్టులు చేయించుకోడానికి వచ్చే ప్రజల సంఖ్యలో పెద్దగా తేడా లేకపోయినా సిబ్బంది కొరత కారణంగా టోకెన్ నెంబర్ ఇచ్చినా వారి వంతు రాకుండానే సమయం ముగిసిపోతోంది.

తగ్గని కరోనా మృతుల సంఖ్య

సెలవు దినాల్లో టెస్టులు, పాజిటివ్ సంఖ్య తగ్గుతున్నా మృతుల సంఖ్యలో మాత్రం తేడా లేదు. తాజా బులెటిన్‌లో గడిచిన 24 గంటల్లో పది మంది కొవిడ్ కారణంగా మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 703కు చేరుకుంది. కొత్తగా నమోదైన 894 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 92,255కు చేరుకుంది. హైదరాబాద్ నగరంలో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసులు రెండంకెల స్థాయిలోనే ఉన్నాయి. ఇంకా 21,420 మంది పాజిటివ్ పేషెంట్లు ఉన్నట్లు బులెటిన్ పేర్కొంది.

Advertisement

Next Story