గేదెలపై చిరుత దాడి.. ప్రతిఘటించిన గేదెలు

by Shyam |   ( Updated:2021-06-10 03:51:23.0  )
Cheetah
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: గేదెలు ప్రతి దాడి చేసిన ఘటనలో చిరుతపులి తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం బూరుగుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నమాజ్ రెడ్డి అనే రైతుకు సంబంధించి అడవి ప్రాంతానికి సమీపంలో వ్యవసాయ పొలం ఉంది. వ్యవసాయంతో పాటు గేదెలను పెంచి పాల వ్యాపారం చేస్తున్నాడు. ప్రతిరోజు గేదెలను వ్యవసాయ పొలం వద్ద ఉన్న కొట్టంలో కట్టి వేసేవారు. ఈ క్రమంలో గురువారం ఉదయం చిరుత పులి ఆ గేదెలపై దాడికి పాల్పడింది. అక్కడ ఉన్న గేదెలలో కొన్ని గేదెలు తప్పించుకొని బయటకు వెళ్ళిపోగా.. మరికొన్ని గేదెలు తాళ్లు తెంచుకొని చిరుతపై ప్రతి దాడికి పూనుకున్నాయి.

ఈ సంఘటనలో చిరుత కింద పడిపోవడంతో గేదెలు దాన్ని తొక్కివేశాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన రైతు గేదెలను అటు నుండి బయటకు వెళ్లగొట్టాడు. చిరుత కదల్లేని పరిస్థితిలో ఉండడంతో వెంటనే సమాచారాన్ని గ్రామస్తులకు, పోలీసులకు అందజేశారు. హుటాహుటిన పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జనం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కదల్లేని పరిస్థితిలో ఉన్న చిరుతను చూస్తున్నారు. కొంతమంది దానికి అవసరమైన ఆహారం, నీళ్లు అందజేశారు. హైదరాబాద్ జూపార్క్ నుండి రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి రానుంది. కాగా ఈ సంఘటనఫై జిల్లా అటవీ శాఖ అధికారి గంగిరెడ్డి ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story