- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ ఎన్నికలపై బడా నేతల దృష్టి
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మహా నగర పాలక సంస్థ ఎన్నికల బరిలో నేతలు తమ భార్యను నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. గ్రేటర్ మేయర్ తో పాటు 150 డివిజన్లలో 75 మహిళా రిజర్వేషన్ కింద కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్ గా కొనసాగుతున్న వారే కాకుండా పార్టీల్లో కీలక పదవుల్లో ఉన్న నాయకులు సైతం దృష్టిసారించారు. అర్ధాంగిని ఎన్నికల బరిలోకి దించేందుకు ముందస్తు వ్యూహం పన్నుతున్నారు. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసేందుకు రెండున్నర నెలల సమయం మాత్రమే ఉంది. ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని మంత్రి కేటీఆర్ ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఎన్నికల ఫీవర్ మొదలైంది.
అన్ని పార్టీల్లో..
కేవలం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోనే కాకుండా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలో ఉన్న పెద్ద నాయకులు సైతం తమ భార్యను బల్దియా ఎన్నికల బరిలోకి దించేందుకు సమాయత్తమవుతున్నారు. అసలు రాజకీయ పరిజ్ఞానం లేని మహిళకు భర్తనే రాజకీయ ఓనమాలు నేర్పుతున్నారు. ఇప్పటికే కార్పొరేటర్ కంటే పెద్ద పదవుల్లో ఉన్నవారు తమ సతీమణులను ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరో వైపు పార్టీ పదవులు ఉండి అధికార పదవి లేని వారు సైతం పోటీ చేయాలనే తలంపుతో ఉన్నారు. వారు ఆశిస్తున్న డివిజన్ ఒకవేళ మహిళలకు రిజర్వ్ చేస్తే ఎలా అనే ముందు చూపుతో భార్యను పోటీకి దింపేందుకు పావులు కదుపుతున్నారు.
జోడు పదవులు..
గ్రేటర్ హైదరాబాద్ లో అంబర్ పేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాలేరు వెంకటేష్, ఆయన సతీమణి కాలేరు పద్మ గోల్నాక కార్పొరేటర్ గా కొనసాగుతున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భార్య స్వప్న సుభాష్ రెడ్డి కార్పొరేటర్ గా ఉన్నారు. ఇదే తీరులో రాబోయే ఎన్నికల్లో నగరంలోని కొంత మంది ఎమ్మెల్యేలు తమ భార్యను కార్పొరేటర్ ఎన్నికల బరిలో దించేందుకు సమాయత్తమవుతున్నారు. గత ఎన్నికల్లో కూడా పలువురు నాయకులు కూతుళ్లను కూడా ఎన్నికల బరిలోకి దించారు. గోషామహల్ నియోజకవర్గం గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ ఎన్నికల్లో మాజీ మంత్రి దివంగత ముఖేష్ గౌడ్ తన కూతురును పోటీ చేయించినప్పటికీ విజయం సొంతం చేసుకోలేకపోయింది. ఈ పర్యాయం గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ తన భార్యను మంగళ్ హాట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించుతారనే ప్రచారం ఊపందుకుంది. మేయర్ పదవి మహిళకు రిజర్వ్ చేయడంతో ప్రస్తుతం మేయర్ గా ఉన్న బొంతు రామ్మోహన్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఆయన భార్యను చర్లపల్లి డివిజన్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారని తెలిసింది.
మేయర్ పీఠంపై గురి..
మేయర్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో పలువురు నాయకులు మేయర్ పదవి వారి సతీమణికి ఇప్పించేందుకు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి పరిస్థితి ఎక్కవగా ఉంది. కార్పొరేటర్ గా బరిలోకి దిగి గెలిస్తే అదృష్టముంటే మేయర్, లేకపోతే కార్పొరేటర్ గా కొనసాగవచ్చనే అభిప్రాయంతో పలువురు నేతలు ఉన్నారు. దీంతో మొత్తం మీద రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ప్రముఖులు బరిలో ఉండే అవకాశాలు ఉండడంతో ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయన్న ప్రచారం జరుగుతోంది.