హెచ్ఎండీఏలో ఇదే క్వశ్చన్ రిపీట్

by Anukaran |
హెచ్ఎండీఏలో ఇదే క్వశ్చన్ రిపీట్
X

దిశ, న్యూస్ బ్యూరో : విశ్వనగరి అభివృద్ధిలో హెచ్ఎండీఏ పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. అథారిటీ చేపట్టబోయే పనులకు అవసరమైన భూములను ప్రభుత్వం కేటాయిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి హైదరాబాద్​, రంగారెడ్డి, మెదక్​ జిల్లాల్లో ప్రభుత్వం భారీగా భూములు కేటాయించింది. అయితే సదరు భూములపై హెచ్ఎండీఏ పర్యవేక్షణాలోపమో, దీర్ఘకాలికంగా ఖాళీగా పెట్టడమోగానీ భూముల చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఏండ్లుగా కనీసం హద్దులు కూడా ఏర్పాటు చేసుకునే పనిలో అథారిటీ చేయకపోవడం చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు యంత్రాంగం అలసత్వం ఏ స్థాయిలో ఉందోనని. కాగా, భూములపై నిఘా, పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు విషయాన్ని గాలికొదిలి, అనుమతి లేని లేఅవుట్లు, నిర్మాణాలపై దృష్టి సారించినట్టు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీంతో భూవివాదాలు అథారిటీకి తలనొప్పులను తెచ్చిపెడుతున్నాయి. దీంతో హెచ్​ఎండీఏ చేపట్టబోయే పలు పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారింది. భూ వివాదాల వల్ల మియాపూర్‌లో ప్రతిపాదిత భారీ ప్రాజెక్టు ఇంటర్ సిటీ బస్ టెర్మినల్(ఐసీబీటీ) నిలిచిపోయిన విషయం తెలిసిందే. కోకాపేట్ భూమిలోనూ వివాదాలు తరచూ తలెత్తుతున్నాయి. అమీర్‌పేట్లో వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రతిపాదిత భారీ పథకాలకు భూములు ఆ భూములను కేటాయించాలంటే ఏ వివాదాలు తలెత్తుతాయోనని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

భూ వివరాలు… వివాదాలు ఇలా…

భూముల వివరాలు.. ప్రభుత్వం నుంచి హెచ్ఎండీఏకు ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి మొత్తం 8260.36 ఎకరాల భూమి కేటాయించబడినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీటిల్లో 3886.17 ఎకరాలను గత 12 సంవత్సరాల కాలంలో పలు రకాల అవసరాలకు వినియోగించగా, 4374.19 ఎకరాల భూమిని ఇంతవరకు దేనికి వాడుకోలేదు. అందులో 3803.02 ఎకరాలపై సుమారు 250 వరకు కేసులు పలు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నట్టు తెలుస్తున్నది. కేవలం 571.17 ఎకరాలు మాత్రమే ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్నట్టు రికార్డులు తెలుపుతున్నాయి.

కేసుల వివరాలు క్లుప్తంగా..

ప్రభుత్వం అథారిటీకి అప్పగించిన 3803.02 ఎకరాల్లో వివాదాలు నడుస్తున్నాయి. 1068.07 ఎకరాలపై ఎస్ఎల్‌పీ 15 కేసులు ఉండగా, 2305.35 ఎకరాలపై డబ్ల్యూపీ హైకోర్టు కేసులు 140 వరకు ఉన్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. 429 ఎకరాలపై ఒరిజినల్ సూట్, భూఆక్రమణ తదితరాలతో పాటు మరిన్ని పెండింగ్​కేసులు కలుపుకుని 95 వరకు కేసులున్నట్టు తెలుస్తున్నది. కాగా, గతంలో కొందరు అథారిటీ వద్ద భూములు కొనుగోలు చేసిన వారు భూమి అప్పగించాలని సంవత్సరాలుగా సంస్థ చుట్టూ తిరుగుతున్నారు. కాగా, హెచ్​ఎండీఏ నుంచి లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ, రో హౌస్‌లకు అనుమతులు తీసుకున్న వారిచ్చిన గిఫ్ట్ భూములు కూడా సంస్థ ఖాతాలో ఉన్నాయి. వీటిపై వివాదాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అథారిటీపైనే ఉంది. అలాగే, 2017 అక్టోబర్ నాటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 7452.30 ఎకరాలు ప్రభుత్వం అథారిటీకి అప్పగించింది. అందులో 3553.19 ఎకరాలను వినియోగించికోగా, 3899.11 ఎకరాలను భారీ పథకాల కోసం ప్రతిపాదించింది. ఆయా భూముల్లో వివాదాలు చోటుచేసుకోవడంతో పథకాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ జిల్లా నుంచి 249.22 ఎకరాలు సంస్థకు కేటాయించగా, 211.24 ఎకరాల్లో పలు పథకాలకు కేటాయించగా, 37.38 ఎకరాలు వినియోగించాల్సి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 558.24 ఎకరాలు కేటాయించగా, 121.14 ఎకరాలను ఉపయోగంలో ఉన్నాయి. కాగా, మిగిలిన 437.10 ఎకరాల్లో భారీ ప్రాజెక్టులైన బస్ టెర్మినల్స్, ట్రక్ పార్కులను నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించింది. కాగా, ఆయా భూములపై ఎలాంటి వివాదాలు తలెత్తకుండా హెచ్​ఎండీఏ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story